Begin typing your search above and press return to search.

సహజీవనం సంగతి పేరెంట్స్ కి చెప్తాం... సీఎం కీలక వ్యాఖ్యలు!

దీని విధివిధానాలకు సంబంధించిన నోటిఫికేషన్, పోర్టల్ ను ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆవిష్కరించారు.

By:  Tupaki Desk   |   28 Jan 2025 6:51 AM GMT
సహజీవనం సంగతి పేరెంట్స్ కి చెప్తాం... సీఎం కీలక వ్యాఖ్యలు!
X

యూనీఫాం సివిల్ కోడ్ (యూసీసీ)కి సంబంధించిన ఆసక్తికర ఘటన సోమవారం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... యూసీసీని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ ఆవిర్భవించింది. ఈ ఉమ్మడి పౌరస్మృతి చట్టం జనవరి 27 నుంచి అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా లివ్ ఇన్ రిలేషన్ షిప్ పై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... ఉమ్మడి పౌరస్మృతి చట్టం నిన్నటి నుంచే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. దీని విధివిధానాలకు సంబంధించిన నోటిఫికేషన్, పోర్టల్ ను ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన.. రాష్ట్రంలోని పౌరులందరికీ సమానమైన హక్కులు, బాధ్యతలు దక్కేలా చూస్తామని వెల్లడించారు.

ఇదే సమయంలో... యూనిఫాం సివిల్ కోడ్ అమలుతో నిజమైన మహిళా సాధికారత సాధించొచ్చని.. బాల్య వివాహాలు, బహుభర్యత్వం, ట్రిపుల్ తలాక్ వంటి దురాచారాలను పూర్తిగా రూపుమాపడానికి ఈ ఉమ్మడి పౌరస్మృతి చట్టం తోడ్పడుతుందని సీఎం పుష్కర్ సింగ్ తెలిపారు. దీన్ని ఏ మతానికో, వర్గానికో వ్యతిరేకం అని భావించొద్దని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలోనే... దీనికి సంబంధించిన పోర్టల్ ద్వారా వివాహం, విడాకులు, సహజీవనం లను ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకోవడాన్ని తప్పనిసరి చేశామని చెబుతూ... ఇందులో మొట్టమొదటిగా ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్.. తన వివాహాన్ని నమోదు చేసుకొని, సర్టిఫికెట్ పొందారు. ఈ సందర్భంగా లివ్ ఇన్ రిలేషన్ షిప్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... రెండో వివాహం, సహజీవనంలో ఉన్న వారికి పుట్టిన ఆడపిల్లలకు ఆస్తిలో సమాన వాటా ఉంటుందని అన్నారు. ఎవరైనా లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉంటే... ఆ విషయాన్ని యూసీసీ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు. అయితే.. ఈ విషయంపై వారి తల్లితండ్రులకు సమాచారం ఇస్తామని చెప్పిన సీఎం.. ఇది గోప్యంగానే ఉంటుందని స్పష్టం చేశారు.