ఉత్తరాఖండ్‌లో అలజడి.. పోలీసుల కాల్పులు.. నలుగురు మృతి.. ఏం జరిగింది?
రంగంలోకి దిగిన పోలీసులు.. బందుల్‌పురా జిల్లాలోని హల్వ్దానీ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న మదరసాను కూల్చేందుకు ప్రయత్నించారు.
By: Tupaki Desk | 9 Feb 2024 7:57 AM GMTచార్ ధామ్ యాత్రలకు ప్రశిద్ది చెందిన దేవ భూమి ఉత్తరాఖండ్‌లో అలజడి నెలకొంది. ఇక్కడి బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి పుష్కర సింగ్ ధామీ దూకుడు శాంతి భద్రతలను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికలకు ముందు.. మొత్తం ఐదుస్థానాలను కైవసం చేసుకునే లక్ష్యంతో మైనారిటీ వర్గాల వ్యవహారంపై వేస్తున్న అడుగులు వివాదాలకు దారితీస్తున్నాయి. ఇటీవల తెచ్చిన ఉమ్మడి పౌర స్మృతి బిల్లులో చేర్చకపోయినా.. రాష్ట్రంలో ముస్లిం వర్గాలు నిర్వహించుకుంటున్న `మదరసాలను` కూల్చేయాలని సర్కారు నిర్ణయించడం వివాదానికి ఆజ్యం పోసింది.
రంగంలోకి దిగిన పోలీసులు.. బందుల్‌పురా జిల్లాలోని హల్వ్దానీ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న మదరసాను కూల్చేందుకు ప్రయత్నించారు. అయితే.. ఈ ఘటనకు ముస్లిం వర్గాల నుంచి తీవ్ర వ్యతిరకత వ్యక్తమైంది. కూల్చివేతలను అడ్డుకుంటూ... వారు రాళ్ల దాడికి దిగారు. దీనికి ప్రతిగా.. పోలీసులు తొలుత భాష్ఫ వాయు గోళాలను ప్రయోగించారు. కానీ, ఇంతలోనే పైనుంచి ఆదేశాలు వచ్చాయి. హల్వ్దానీలో ముస్లిం వర్గాలు తిరుగుబాటు చేయడంపై ముఖ్యమంత్రి రగిలిపోయారు.
కాల్చివేతకు ఆదేశాలు జారీ చేశారు. అంతే.. పోలీసులు తుపాకులకు పని కల్పించారు. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు నలుగురు మృతి చెందగా.. పదుల సంఖ్యలో మైనారిటీ వర్గాల ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. సోషల్ మీడియాను నిలిపివేశారు. ఇంటర్నెట్ ను బంద్ చేశారు. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పిలుపునిచ్చింది.
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో మరోసారి బీజేపీ ని గెలిపించుకునే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి పుష్కర సింగ్ ధామీ దూకుడు చూపిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో 5 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. వీటిలో గత ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ప్రధానంగా బీజేపీ గెలిచింది. ఇప్పుడు కూడా మరోసారి బీజేపీని గెలిపించే ఉద్దేశంతోనే యూసీసీని ఆగమేఘాలపై అమలు చేస్తున్నారు. ఇదే విప్పుడు వివాదాలకు దారితీస్తోంది.