స్కూల్లో పాఠాలు చెబుతుండగా తలాక్... మేటర్ సీరియస్!
వివరాళ్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ జిల్లాలోని కరీమ్ గంజ్ కు చెందిన షకీల్ తో తమన్నాకు 2020లో వివాహం అయ్యింది.
By: Tupaki Desk | 29 Aug 2023 6:46 AM GMTతీన్ తలాక్ గురించి తెలిసిన విషయమే! అయితే దానికీ ఒక సమయం సందర్భం ఉండనవసరం లేదనుకున్నాడొ ఏమో తెలియదు కానీ... పాఠశాలలో పాఠాలు చెబుతున్న తన భార్య దగ్గరకు వెళ్లిన ఆమె భర్త... విద్యార్థుల ముందే తీన్ తలాక్ చెప్పాడు. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
అవును... టీచర్ గా పనిచేస్తున్న తన భార్యకు స్కూలులోనే అతని భర్త తీన్ తలాక్ చెప్పాడు. విద్యార్థులందరి ముందు ఈ చర్యకు పాల్పడిన అతను ఆ తరువాత అక్కడి నుంచి జారుకున్నాడు. ఈ ఘటన అనంతరం బాధిత మహిళ తన భర్తతోపాటు మరో నలుగురిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో మ్యాటర్ సీరియస్ అయ్యింది.
వివరాళ్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ జిల్లాలోని కరీమ్ గంజ్ కు చెందిన షకీల్ తో తమన్నాకు 2020లో వివాహం అయ్యింది. అయితే ఆ సమయంలో కట్నం రూపంలో రెండు లక్షలు కావాలని షకీల్ డిమాండ్ చేయగా... అంతమొత్తం ఇచ్చుకోలేకపోవడంతో ఆమెను షకీల్ ఇంటి నుంచి గెంటివేశాడు. దీంతో తమన్నా పుట్టింటికి చేరుకుంది.
దీంతో... బారాబంకి పరిధిలోని బేగమ్ గంజ్ ప్రాంతంలో పాఠశాలలో పనిచేసుకుంటుంది. కొంతకాలం తరువాత షకీల్ భార్యకు చెప్పకుండా సౌదీ వెళ్లిపోయాడు. ఈ విషయం తెలియగానే తమన్నా అత్తవారింటికి వెళ్లింది. అయితే అత్తింటి వారు ఆమెను ఇంటిలోనికి వచ్చేందుకు నిరాకరించడంతో.. తిరిగి పుట్టింటికి చేరుకుంది.
ఈ సమయంలో సౌదీ నుంచి తిరిగి వచ్చాడు షకీల్. వచ్చిన అనంతరం తన భార్యకు ఫోన్ చేసి విడాకులు ఇస్తానని బెదిరించాడు. తరువాత తాజాగా ఆమె పనిచేస్తున్న స్కూలుకు వచ్చి, ఆమెకు తీన్ తలాక్ చెప్పాడు. దీంతో ఖంగు తిన్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.