Begin typing your search above and press return to search.

వైకుంఠ ఏకాదశికి 7 లక్షల టికెట్లా.. కొండ కిటకిటే!

ఆన్ లైన్ లో జారీ చేసే టికెట్లే 7 లక్షలు అంటే.. రోజుకు 70 వేల టికెట్లు ఆన్ లైన్ లో అందుబాటులోకి తీసుకొస్తే.. ఆఫ్ లైన్ మాటేమిటి?

By:  Tupaki Desk   |   7 Oct 2023 4:55 AM GMT
వైకుంఠ ఏకాదశికి 7 లక్షల టికెట్లా.. కొండ కిటకిటే!
X

డిసెంబరు వచ్చేస్తోంది. కొత్త సంవత్సరానికి కాస్త ముందుగా వచ్చే వైకుంఠ ఏకాదశికి ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తటం తెలిసిందే. వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే.. జన్మ ధన్యమైనట్లేనని.. పాపాలన్ని తొలిగిపోతాయని.. అంతా శుభమే జరుగుతుందన్న నానుడి తెలిసిందే. కాస్త కష్టమైనప్పటికీ వైకుంఠ ఏకాదశికి స్వామివారిని దర్శించుకోవాలని భక్తులు పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకుంటారు.

ఆ వేళ భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ స్వామి వారిని దర్శించుకోవటానికి ప్రయాసకు సిద్ధమవుతారు. భక్తుల రద్దీకి తగ్గట్లు ఏర్పాట్లు చేసే విషయంలో టీటీడీ భారీ ఎత్తున కసరత్తు చేస్తుంటుంది. ఇదిలా ఉంటే.. ఈసారి వైకుంఠ ఏకాదశి సందర్భంగా మొత్తం 10 రోజులకు (డిసెంబరు 23 నుంచి జనవరి 1 వరకు) 7 లక్షల టికెట్లు జారీ చేయనున్నట్లుగా పేర్కొన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి.

ఆన్ లైన్ లో జారీ చేసే టికెట్లే 7 లక్షలు అంటే.. రోజుకు 70 వేల టికెట్లు ఆన్ లైన్ లో అందుబాటులోకి తీసుకొస్తే.. ఆఫ్ లైన్ మాటేమిటి? అన్నది ప్రశ్న. విపరీతమైన రద్దీ వేళలోనూ రోజుకు 70 - 75 వేలకు మించి స్వామివారి దర్శనం చేయటం కష్టమవుతుంది. అలాంటిది ఆన్ లైన్ లోనూ 70 వేల టికెట్లు జారీ చేస్తే.. వీఐపీలు.. వీవీఐపీలు.. మాటేమిటి? ఒక వీవీఐపీ వస్తే చాలు.. దాదాపు గంట నుంచి గంటన్నర వరకు టైం పోతుంది. అందునా వైకుంఠ ఏకాదశి రోజు.. జనవరి 1 వచ్చే భక్తుల సంఖ్య భారీగా ఉంటుంది.

ఇలాంటి వేళ.. ఇంత భారీగా దర్శన టికెట్లు జారీ చేస్తే.. భక్తుల రద్దీతో కొండ కిటకిటలాడటం ఖాయం. తిరుమలకు వచ్చే భక్తులకు అవసరమైన వసతుల్ని.. ఏర్పాట్లను అందించే విషయంలో విమర్శలు ఎదుర్కోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. తాము విడుదల చేసే మొత్తం 7 లక్షల టికెట్లలో రెండు లక్షల టికెట్లను త్వరలోనే ఆన్ లైన్ లో విడుదల చేస్తామని.. పది రోజుల వ్యవధిలో ఆఫ్ లైన్ లో ఐదు లక్షల టికెట్లను ఇస్తామని చెబుతున్నారు. ఏమైనా.. ఇంత భారీగా టికెట్లను జారీ చేయటం బాగానే ఉన్నా.. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయగలుగుతారా? అన్నది ప్రశ్న.ఈ విషయంలో మరింత కసరత్తు చేయాల్సిన అవసరం టీటీడీ మీద ఉందన్నది మర్చిపోకూడదు.