Begin typing your search above and press return to search.

వాజేడు ఎస్సై ఆత్మహత్య ఘటన... తెరపైకి ప్రేమించిన యువతి బ్లాక్ మెయిల్!!

అయితే... ఎస్సై ఆత్మహత్యకు వ్యక్తిగత విషయాలే కారణం అని ఒకరంటే.. అతని ఆత్మహత్యకు ఉన్నతాధికారుల వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారనే కథనాలు వచ్చాయి.

By:  Tupaki Desk   |   5 Dec 2024 5:26 AM GMT
వాజేడు ఎస్సై ఆత్మహత్య ఘటన... తెరపైకి ప్రేమించిన యువతి బ్లాక్  మెయిల్!!
X

ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఇటీవల ఎన్ కౌంటర్ జరిగిన రాత్రే.. వాజేడు ఎస్సై హరీశ్ ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఓ రిసార్ట్ లో తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య చేసుకున్నాడు! దీంతో... ఈ విషయం డిపార్ట్ మెంట్ లోనూ సంచలనంగా మారింది.

అయితే... ఎస్సై ఆత్మహత్యకు వ్యక్తిగత విషయాలే కారణం అని ఒకరంటే.. అతని ఆత్మహత్యకు ఉన్నతాధికారుల వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారనే కథనాలు వచ్చాయి. ఈ సమయంలో ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. ఓ యువతితో ఉన్న పరిచయం, ప్రేమ, పెళ్లి ప్రపోజల్.. అనంతరం తెలిసిన ఆమె గతం కీలకంగా మారింది!

అవును... ములుగు జిల్లా వాజేడు ఎస్సై హరీశ్ ఆత్మహత్య ఘటనలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. తమ శాఖకు చెందిన యువ అధికారి సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు దర్యాప్తులో అనేక విషయాలు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఓ యువతిని అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు.

సుమారు ఏడు నెలల క్రితం హరీశ్ కు ఓ యువతి నుంచి ఫోన్ కాల్ వచ్చిందంట. ఈ క్రమంలో ఆ యువతితో హరీశ్ మాటలు కలవడం, సోషల్ మీడియా అకౌంట్స్ షేర్ చేసుకుని వాటిలో ఛాటింగ్ చేసుకునేవరకూ దగ్గరయ్యారంట! ఈ క్రమంలో హైదరాబాద్ లో చదువుకునే ఆమె వీకెండ్స్ లో వాజేడుకు వచ్చి.. రెండు రోజులు అక్కడే ఉండి వెళ్లేదని అంటున్నారు.

ఈ క్రమంలో.. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. ఈ క్రమంలో... సూర్యపేట జిల్లా చిలుకూరు మండలానికి చెందిన ఆ యువతికి ఊర్లో ముగ్గురు యువకులతో స్నేహం ఉందని.. అందులో ఒకరు పెళ్లికి నిరాకరించడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైందని అంటున్నారు.

అయితే... ఈ విషయం తెలుసుకున్న హరీశ్.. ఆమెతో పెళ్లి ప్రతిపాదన తిరస్కరించి, ఇంట్లో చూసిన సంబంధం చేసుకునేందుకు సిద్ధమయ్యాడట. ఈ క్రమంలో ఈ విషయంపై మాట్లాడుకునేందుకు ఆదివారం (డిసెంబర్ 1) ఓ రిసార్టులో కలిశారని.. అక్కడే ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగిందని.. సెటిల్ మెంట్ చేసుకోవడానికి ఎస్సై ప్రయత్నించగా.. అందుకు ఆమె అంగీకరించలేదని అంటున్నారు.

దీనికి తోడు.. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెబుతానని ఆమె బెదిరించిందని.. దీంతో మనస్థాపం చెందిన హరీశ్ ఆత్మహత్య చేసుకున్నట్లు తేలిందని అంటున్నారు. దీంతో... తమ కుమారుడి మృతికి ఆ యువతే కారణం అంటూ హరీశ్ పేరెంట్స్ ఫిర్యాదు చేయడంతో.. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారని తెలుస్తోంది.