Begin typing your search above and press return to search.

రామోజీకి అప్పట్లో వంశీ మామిడిపండ్లు.. ఇప్పుడు అతడు, నాని ఎక్కడ?

మీడియా దిగ్గజం, మేరు నగంలాంటి రామోజీరావు మరణం నుంచి తెలుగు ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   10 Jun 2024 6:40 AM GMT
రామోజీకి అప్పట్లో వంశీ మామిడిపండ్లు.. ఇప్పుడు అతడు, నాని ఎక్కడ?
X

మీడియా దిగ్గజం, మేరు నగంలాంటి రామోజీరావు మరణం నుంచి తెలుగు ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఏపీలో కూటమి అద్భుత విజయాన్ని అందరూ ఆశ్చర్యపోయి చూస్తున్న వేళ.. ఆ గెలుపును తీవ్రంగా కాంక్షించిన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మరణం అనుకోని పరిణామం. వ్యక్తిగా కాక.. వ్యవస్థగా చూడాల్సిన మనిషి రామోజీరావు. ఆయన మరణంతో ప్రముఖుల నుంచి సాధారణ ప్రజల వరకు రామోజీ ఫిలింసిటీకి వెళ్లి ఘనంగా నివాళులు అర్పించారు.

అప్పట్లో వంశీ అలా..

రామోజీరావు పుట్టింది క్రిష్ణా జిల్లా గుడివాడ దగ్గర్లోని పెదపారుపూడి అనే సంగతి అందరికీ తెలిసిందే. అదే జిల్లాకు చెందిన వల్లభనేని వంశీ గన్నవరం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2015లో వంశీ టీడీపీలో ఉన్న సమయంలో రామోజీరావు కోసం మేలైన మామిడి పండ్లను కొన్ని పెట్టెల్లో పెట్టి ఫిలిం సిటీకి పంపారు. క్రిష్ణా జిల్లా నూజివీడు మామిడి కాయలు ఎంత ప్రసిద్ధిచెందినవో అందరికీ తెలిసిందే. అక్కడే కాదు.. క్రిష్ణా జిల్లాలో చాలా ప్రాంతాల్లో మామిడి బాగా పండుతుంది. వీటిలోంచే కొన్ని వల్లభనేని వంశీ ఫిలింసిటీకి పంపి ఉంటారు.

పరిస్థితులు తారుమారు

2019 ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థిగానే పోటీచేసిన వంశీ ఆ తర్వాత అప్పటి అధికార పార్టీ వైసీపీ వైపు మొగ్గారు. అసెంబ్లీలోనూ టీడీపీ సభ్యులతో కాకుండా విడిగా కూర్చున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిపై మూడేళ్ల కిందట చేసిన తీవ్ర ఆరోపణలకు వంశీనే కారణమని బాగా వినిపించింది. మొత్తమ్మీద టీడీపీ, చంద్రబాబుతో తీవ్రంగా విభేదించిన వంశీ వైసీపీ పక్షాన చేరారు. ఇటీవలి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

కొడాలి నానీ కూడా దూరమే..

క్రిష్ణా జిల్లాకే చెందిన మరో ఎమ్మెల్యే కొడాలి నాని. వంశీ కంటే ముందే టీడీపీ నుంచి బయటకు వచ్చిన ఈయన వైసీపీలో చేరి ఏపీలో మంత్రిగానూ పనిచేశారు. టీడీపీ అధినేత చంద్రబాబును, ఆయన కుమారుడు లోకేశ్ నూ తీవ్రంగా విమర్శించారు. అది కూడా వ్యక్తిగతంగా ఏకవచనంతో సంబోధిస్తూ వచ్చారు.

వైసీపీలో చేరాక అటు వంశీ, ఇటు నానీ ఇద్దరూ రామోజీపై విరుచుకుపడ్డారు. చంద్రబాబుతో కలిపి రామోజీరావును పదేపదే దూషించారు. వాస్తవానికి వీరు టీడీపీలో ఉండి ఉన్నా, వైసీపీలో చేరినప్పటికీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేయకున్నా.. రామోజీ కడసారి చూపునకు వెళ్లే వారేమో? కానీ, ఆ చాన్స్ లేకుండా అయింది. అఫ్ కోర్స్.. వైసీపీ వారెవరూ రామోజీని చూసేందుకు వెళ్లలేదు. కానీ, క్రిష్ణా జిల్లా, అందులోనూ సొంత సామాజికవర్గానికి చెందిన దిగ్గజం అయిన రామోజీని వంశీ, నాని కడసారి చూసే భాగ్యం మిస్ అయ్యారు.