అనుక్షణం ఉత్కంఠ.. 9 గంటల విచారణ.. వంశీ కేసులో ఎన్నో ట్విస్టులు
అయితే 9 గంటల విచారణ అనంతరం రాత్రి 9.30 ప్రాంతంలో ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
By: Tupaki Desk | 13 Feb 2025 4:32 PM GMTగన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసును ఎదుర్కొంటున్న వంశీపై అనూహ్యంగా కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం ఉదయం హైదరాబాదులో అరెస్టు చేశారు. అరెస్టుపై ఆయనకు నోటీసులు ఇచ్చిన పోలీసులు భారీ భద్రత మధ్య విజయవాడకు తీసుకువచ్చి.. క్రిష్ణలంక పోలీసు స్టేషనులో సుదీర్ఘంగా విచారించారు. ఆయన విచారణ సమయంలో కేవలం వంశీ భార్యను పంకజశ్రీని మాత్రమే అనుమతించారు. న్యాయవాదులను అనుమతించకపోవడంతో వంశీ విషయంలో ఏం జరుగుతుందనే ఉత్కంఠ కనిపించింది. అయితే 9 గంటల విచారణ అనంతరం రాత్రి 9.30 ప్రాంతంలో ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
హైదరాబాద్ లో వంశీని అదుపులోకి తీసుకున్న నుంచి అస్పత్రికి తీసుకువెళ్లేవరకు వంశీ విషయంలో పోలీసులు ఏం చేయనున్నారనేది టెన్షన్ పుట్టించింది. ఇటు అధికార పార్టీ కార్యకర్తలతోపాటు వైసీపీ కార్యకర్తలు కూడా వంశీ విషయంలో పోలీసులు ఎలాంటి అడుగులు వేస్తున్నారనేది గమనిస్తూనే ఉన్నారు. దీంతో పోలీసులు అత్యంత జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. విజయవాడ నగరంలో 144 సెక్షన్ విధించి ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు చేయకుండా అడ్డుకున్నారు. పోలీసుల అంక్షల వల్ల క్రిష్ణలంక పోలీసు స్టేషన్ వద్ద మీడియా హడావుడి తప్ప కార్యకర్తలు ఎవరూ రాలేదు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడి వచ్చి ఇబ్బందుల్లో ఇరుక్కోవడం ఎందుకనే కోణంలోనూ కొందరు రాలేదని చెబుతున్నారు. పోలీసు స్టేషన్ వద్దకు రమ్మని కొందరిని పిలిచినా ముఖం చాటేశారని ప్రచారం జరుగుతోంది.
మరోవైపు హైదరాబాద్ నుంచి విజయవాడకు వంశీని తెచ్చిన పోలీసులు మార్గ మధ్యలో ఆయన భార్యను అడ్డుకున్నారు. గంటన్నరపాటు విజయవాడ శివార్లలో ఆమెను నిర్బంధి ఆ తర్వాత వదిలేశారని వంశీ భార్య పంకజశ్రీ మీడియాకు తెలిపారు. పోలీసులు విడిచిపెట్టిన అనంతరం క్రిష్ణలంక పోలీసు స్టేషనుకు న్యాయవాదులతో వచ్చిన వంశీ భార్య.. భర్త కోసం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె తప్పు ఎవరైనా చేస్తారని, కానీ, సహజ న్యాయం కూడా పాటించాలని పోలీసులను కోరారు. తన భర్త ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆమెను సాయంత్రం వంశీతో మాట్లాడించారు. ఆయన ధైర్యంగా ఉన్నానని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక పోలీసు విచారణ సందర్భంగా తమను అనుమతించడంపై వంశీ తరఫు న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులు, గ్యాంగ్ స్టర్లపై మోపిన సెక్షన్లను వంశీపై నమోదు చేయడం ఏంటని ఆయన తరపు న్యాయవాది మీడియా ముఖంగా ప్రశ్నించారు.
మరోవైపు వంశీకి మద్దతుగా వైసీపీ నేతలు ఎక్కడికక్కడ మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు, సీనియర్ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్ తదితరులు డీజీపీని కలిసేందుకు వెళ్లినా, ఆయన అందుబాటులో లేక వెనుదిరిగారు. ఇటు క్రిష్ణలంక పోలీసు స్టేషన్ వద్ద వంశీ భార్యకు మద్దతుగా నందిగామ మాజీ ఎమ్మెల్యే జగన్మోహనరావు, పోతిన మహేశ్ వచ్చారు. ఈ ఇద్దరూ వంశీ భార్యకు ధైర్యం చెప్పడం కనిపించింది. మొత్తానికి ఉదయం నుంచి రాత్రి పది గంటల వరకు వంశీ విషయంలో పోలీసులు ఎలా ముుందుకెళతారనేది ఉత్తంఠ రేకెత్తించింది. చివరికి ఆస్పత్రికి తరలించడంతో అర్ధరాత్రి లోగా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారని చెబుతున్నారు.