వంశీ కేసులో ట్విస్టు : సమయం కోరిన పోలీసులు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ బెయిల్ పిటిషన్ పై కోర్టులో విచారణ మరోమారు వాయిదా పడింది.
By: Tupaki Desk | 21 Feb 2025 8:31 AM GMTగన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ బెయిల్ పిటిషన్ పై కోర్టులో విచారణ మరోమారు వాయిదా పడింది. ఈ విషయమై కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు మూడు రోజులు సమయం కావాలని పోలీసులు కోరడంతో కోర్టు విచారణను వాయిదా వేసింది. అయితే పోలీసుల తీరుపై వంశీ తరఫు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే పోలీసులు కౌంటర్ దాఖలు చేయడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే వంశీ బెయిల్ పిటిషన్ కౌంటర్ వేసేందుకు పోలీసులు రెండు సార్లు సమయం ఇచ్చిందని, ఇంకా మూడు రోజులు సమయం కోరడం భావ్యం కాదని వంశీ న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
మాజీ ఎమ్మెల్యే వంశీ బెయిల్ పిటిషన్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. సత్యవర్థన్ కిడ్నాప్ వ్యవహారంలో వంశీ నేరుగా పాల్గొనలేదని, ఆయనను కుట్రపూరితంగా ఇరికించారని వంశీ న్యాయవాదులు ఆరోపించారు. అనారోగ్య కారణాలను పరిగణలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేయాలని కోర్టును విన్నవించారు. వంశీ న్యాయవాదులు వేసిన పిటిషన్ పై కౌంటర్ వేయాలని మూడు రోజుల క్రితం న్యాయస్థానం ఆదేశించింది. అయితే ఇప్పటివరకు పోలీసులు కౌంటర్ దాఖలు చేయకపోవడమే కాకుండా, మరోసారి గడువు కోరడంతో విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
వంశీపై నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. మరోవైపు కిడ్నాప్ కేసులో అరెస్టు చేసిన వంశీని పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. ఇదే కేసులో బెయిల్ కోసం వంశీ తరపు న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు. అదేసమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న వంశీకి ప్రత్యేక వసతులు కల్పించాలని అభ్యర్థిస్తూ మరో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఏ విషయంలోనూ వంశీకి ఊరట దక్కడం లేదని అంటున్నారు.