వంశీ నోటి దూల: సొంత సామాజిక వర్గం కూడా దూరం..!
వైసీపీ నాయకుడు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముప్పేట కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా రు. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు.
By: Tupaki Desk | 27 Feb 2025 2:45 AM GMTవైసీపీ నాయకుడు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముప్పేట కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా రు. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. అయితే.. బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా.. మరోవైపు వరుసగా నమోదవుతున్న కేసుల కారణంగా.. ఆయన బెయిల్‌పై బయటకు వచ్చినా.. ఆ వెంటనే మరో కేసులో అరెస్టు ఎదురు చూస్తోంది. సాధారణంగా.. రాజకీయ నాయకులకు ఇలాంటి సందర్భాల్లో అంతో ఇంతో సానుభూతి వ్యక్తమవుతుంది.
తమ నాయకులు జైల్లో ఉంటే.. వారి అనుచరులు.. లేదా పార్టీ కార్యకర్తలు, వీరెవరూ కాకపోయినా.. సామాజిక వర్గం వారిగా అయినా.. సదరు నాయకులకు మద్దతు లభిస్తుంది. ఇంటా బయటా కూడా.. తమ నాయకుడి కోసం ఆవేదన వ్యక్తం చేస్తారు. రోడ్డెక్కుతారు. చంద్రబాబు అరెస్టు సమయంలో ఇదే జరిగింది. అయితే.. చంద్రబాబు స్థాయి వంశీకి లేకపోయినా.. కనీసం.. వరుస విజయాలు దక్కించుకున్న సొంత నియోజకవర్గం గన్నవరంలోనూ ఎవరూ నోరు ఎత్తడం లేదు.. సానుభూతి కురిపించడం లేదు.
మరీ ముఖ్యంగా సొంత సామాజిక వర్గం కమ్మల్లోనూ వంశీ పై సానుభూతి కొరవడింది. ఒకప్పుడు తన కులపోళ్లంతా తనకే అండగా ఉంటారని బహిరంగ వ్యాఖ్యలు చేసిన వంశీకి..ఇప్పుడు ఆ సామాజిక వర్గం కూడా దూరంగానే ఉంది. దీనికి కారణం.. నోటి దూలేనని అంటున్నారు పరిశీలకులు. వైసీపీలో చేరిన తర్వాత.. ఆయన నోటికి పనిచెప్పడం.. ఏకంగా చంద్రబాబు కుటుంబంపైనే దుమ్మెత్తి పోయడం.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కారణంగా.. ఇప్పుడు ఎవరూ కూడా వంశీనితలుచుకోవడం లేదు.
ఏం జరుగుతుంది..
సాధారణంగా.. ఒక నాయకుడికి సానుభూతి కొరవడితే.. అది మున్ముందు తీవ్ర పరిణామంగా మారే అవకాశం ఉంటుంది. ఎన్నికలలో మరింత రిఫ్లెక్ట్ అవుతుంది. ఫలితంగా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇదే ఇప్పుడు వంశీకి ఎదురయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు వీరి మద్దతు కొరవడితే.. మరిన్ని ఓటములు ఎదుర్కొనక తప్పదన్న సంకేతాలు వస్తున్నాయి. అందుకే.. నాయకులైనా.. ఎవరైనా..నోరు అదుపులో పెట్టుకోవాల్సిందేనని చెబుతున్నారు.