వంశీపై కేసుల పరంపర.. తాజాగా మరో కేసు
వంశీ అరెస్టు తర్వాత గన్నవరం నియోజకవర్గంలో మూడు కేసులు నమోదు అవ్వగా, తాజాగా మరో ఫిర్యాదు అందింది.
By: Tupaki Desk | 27 Feb 2025 4:50 AM GMTగన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. కిడ్నాప్ కేసులో అరెస్టు అయిన ఆయనపై అప్పటికే 16 కేసులు పెండింగులో ఉండగా, తాజాగా రోజుకో ఫిర్యాదు అందుతోంది. అలా ఫిర్యాదు అందుకోగానే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో వంశీపై కేసుల విచారణకు ప్రభుత్వం ఏకంగా సీనియర్ ఐపీఎస్ అధికారులతో కూడిన సిట్ ఏర్పాటు చేసింది. దీంతో ఇన్నాళ్లు ఆయనకు భయపడి ఫిర్యాదు చేయని వారు ఇప్పుడు ధైర్యంగా పోలీసుస్టేషనుకు వచ్చి కేసులు పెడుతున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే వంశీని టార్గెట్ చేసిన ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
వంశీ అరెస్టు తర్వాత గన్నవరం నియోజకవర్గంలో మూడు కేసులు నమోదు అవ్వగా, తాజాగా మరో ఫిర్యాదు అందింది. దీనిపైనా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో వంశీపై మొత్తం కేసుల సంఖ్య 20కి చేరింది. ఒకదాని మీద ఒక ఎఫ్ఐఆర్ వేస్తుండటంతో వంశీ ఇప్పట్లో బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదని న్యాయవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. గన్నవరం శివారు మర్లపాలెంలోని పానకాల చెరువులో అక్రమంగా మట్టి తవ్వారని, ఆ చెరువులో కొంత భాగాన్ని సాగు చేసుకుంటున్న తమపై దౌర్జన్యం చేశారని వంశీ బ్యాచ్ పై మురళీక్రిష్ణ అనే రైతు మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వంశీతోపాటు ఆయన అనుచరులు అనగాని రవి, రంగా, శేషు, మేచినేని బాబులపై పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.
పానకాల చెరువులో మట్టి తవ్వకంతోపాటు అక్రమ మట్టి, ఇసుక మైనింగులో రూ.195 కోట్లు కొల్లగొట్టారని వంశీపై విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారమే సిట్ దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. అయితే విజిలెన్స్ నివేదికకు ఆధారంగా ఇప్పుడు రైతులు ఫిర్యాదు చేయడం గమనార్హం. వంశీ ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉండటంతో తాము భయపడి ఫిర్యాదు చేయలేదని, 15 మంది రైతులను బెదిరించి చెరువును స్వాధీనం చేసుకున్న వంశీ అక్రమంగా మట్టి తవ్వించారని ఫిర్యాదు చేశారు.
దీంతో వంశీ బ్యాచ్ అక్రమ మైనింగుకు స్థానికులు సాక్ష్యంగా పనికొస్తారని న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ఈ ఫిర్యాదుల పరంపర పరిశీలిస్తే వంశీకి ఒక కేసులో బెయిల్ వచ్చినా, మరో కేసులో అరెస్టు చేయడమే వ్యూహంగా కనిపిస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో నోటిని అదుపు చేసుకోకుండా మాట్లాడటమే వంశీ ప్రస్తుత కష్టాలకు కారణమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే అప్పట్లో వంశీ ఒక్కరే నోరు పారేసుకుంటే.. ఇప్పుడు ఆయన అనుచరులకు కూడా అరదండాలు వేస్తుండటంతో గన్నవరంలో వంశీ మనుషులుగా ముద్రపడిన వారు భయంతో అండర్ గ్రౌండుకు వెళ్లిపోతున్నారని అంటున్నారు. మరోవైపు తమది తప్పైపోయిందని, తాము గతంలో టీడీపీ మనుషులమేనని గుర్తించాలని కూటమి పెద్దలను వేడుకుంటున్నట్లు చెబుతున్నారు.