5 గంటలు.. 36 ప్రశ్నలు.. ఆత్కూరు పోలీస్ స్టేషన్ లో వంశీ
పలు కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కొద్దికాలంగా జైల్లో ఉంటున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 30 March 2025 4:19 AMపలు కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కొద్దికాలంగా జైల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయనపై నమోదైన మరో కేసుకు సంబంధించి విచారణ క్రిష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్టేషన్ లో జరిగింది. దాదాపు ఐదు గంటల పాటు జరిగిన విచారణలో మొత్తం 36 ప్రశ్నల్ని ఎదుర్కొన్నట్లుగా తెలుస్తోంది. తన అనుచరులతో కలిసి బెదిరింపులకుదిగటం.. భూమిఅమ్మకాలకు సంబంధించి ఆయనపై వచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు.
క్రిష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్టేషన్ లో తేలప్రోలుకు చెందిన శనగల శ్రీధర్ రెడ్డి వంశీపై కంప్లైంట్ చేశారు. దీంతో.. ఆయనపై కేసు నమోదైంది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో విజయవాడలోని జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీని పోలీసు విచారణకు ఆత్కూరు స్టేషన్ కు తీసుకురావటం తెలిసిందే. పోలీసు విచారణకు ముందు కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల్నినిర్వహించారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు తరలించారు.
వంవీ తరఫు న్యాయవాది.. ఇద్దరు వీఆర్వోల సమక్షంలో హనుమాన్ జంక్షన్ సీఐ సత్యనారాయణ పలు ప్రశ్నలు సంధించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం 36 ప్రశ్నల్ని ఎదుర్కొన్న వంశీ.. ఎక్కువగా తనకు తెలీదని.. అవన్నీ తప్పుడు ఆరోపణలుగా తేల్చినట్లుగా చెబుతున్నారు. ఏ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని చెబుతున్నారు. సుమారు ఐదు గంటల పాటు జరిగిన విచారణ అనంతరం గన్నవరం అదనపు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. ఈ సందర్భంగా తన సతీమణితో మాట్లాడేందుకు అనుమతించాలని కోరగా.. ఐదు నిమిషాలు టైమిచ్చారు. అనంతరం ఆయన్ను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.