Begin typing your search above and press return to search.

వంశీకి వరుస ఎదురుదెబ్బలు... ప్రభుత్వం పంతం నెగ్గినట్లేనా?

వైసీపీ నేత వల్లభనేని వంశీకి రోజులు కలిసిరావడం లేదు. ఇప్పటికే కిడ్నాప్ కేసులో అరెస్టు అయిన వంశీపై మరో కేసులో అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

By:  Tupaki Desk   |   24 Feb 2025 11:04 AM GMT
వంశీకి వరుస ఎదురుదెబ్బలు... ప్రభుత్వం పంతం నెగ్గినట్లేనా?
X

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ రోజు ఆయనకు వ్యతిరేకంగా వచ్చిన రెండు అప్డేట్స్ వంశీని మరింత ఇబ్బంది పెట్టేవే అంటున్నారు. ప్రస్తుతం కస్టడీలో ఉన్న వంశీని పీటీ వారెంటుపై రేపు కోర్టులో హాజరుపర్చాల్సివుంది. ఇదే సమయంలో ఆయనను పది రోజుల కస్టడీకి ఇవ్వాల్సిందిగా పోలీసులు వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం మూడు రోజుల కస్టడీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.

వైసీపీ నేత వల్లభనేని వంశీకి రోజులు కలిసిరావడం లేదు. ఇప్పటికే కిడ్నాప్ కేసులో అరెస్టు అయిన వంశీపై మరో కేసులో అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయనపై పీటీ వారెంటు జారీ చేసి రేపు మూడో అదనపు జిల్లా జడ్జి కోర్టులో హాజరుపరచనున్నారని చెబుతున్నారు. ఒక కేసులో అరెస్టు అయి జైలులో ఉన్న నిందితుడిని మరో కేసులో కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు పీటీ వారెంటు జారీ చేస్తారు. అయితే ఎస్సీ, ఎస్టీ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో ఆ కేసులో అరెస్టు చూపే అవకాశం ఉందని వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు. ఈ విషయమే వారికి ఆందోళన కలిగిస్తుండగా, మధ్యాహ్నం మరో పిడుగులాంటి వార్త వంశీ అనుచరులను భయపెట్టింది.

కిడ్నాప్ కేసులో మరిన్ని వివరాలు సేకరించాల్సివున్నందున వంశీని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే పోలీసులు పది రోజులు కస్టడీ అడిగితే, కోర్టు మూడు రోజుల కస్టడీకి అప్పగించింది. దీంతో కూటమి ప్రభుత్వం పంతం నెగ్గినట్లైంది. ఉదయం పది నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలీసులు వంశీని విచారించనున్నారు. అయితే ఇదే సమయంలో వంశీకి కాస్త ఊరట కల్పిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. అనారోగ్యం బారిన పడుతున్న ఆయనను వీఐపీ ఖైదీగా పరిగణించి మంచం, వెస్టరన్ టాయిలెట్ సౌకర్యం కల్పించాలని పోలీసులను ఆదేశించింది.

వంశీ పోలీసు కస్టడీతో ఆయనకు చిక్కులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కస్టడీలో వంశీని ప్రశ్నించనున్న పోలీసులు ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, యువనేత లోకేశ్ ను గతంలో ఇష్టానుసారం దూషించిన వంశీని టార్గెట్ చేసినట్లే కనిపిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వంశీని అన్నివిధాలుగా ఇరికించేందుకు పోలీసులు పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఆయన జైలులో ఉండగానే కేసు మీద కేసు పెట్టి.. వీలైనంత ఎక్కువ కాలం జైల్లో పెట్టేలా చూడాలని కూటమి నేతలు పోలీసులను ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి వంశీ ఎపిసోడ్ రాజకీయాన్ని వేడెక్కిస్తోంది.