Begin typing your search above and press return to search.

వంశీ అన్నా... ఎలా అయిపోయావో చూసుకో !

కాలం గొప్పది అని అందుకే అంటారు. దాని ప్రభావానికి ఎవరైనా గురి కావాల్సిందే. వల్లభనేని వంశీ అంటే సినిమా హీరోలా గ్లామర్ గా ఉంటారు అని మాజీ సీఎం జగన్ పొగిడారు.

By:  Tupaki Desk   |   30 March 2025 5:36 AM
Vallabhaneni Vamsis Transformation After Jail Time
X

కాలం గొప్పది అని అందుకే అంటారు. దాని ప్రభావానికి ఎవరైనా గురి కావాల్సిందే. వల్లభనేని వంశీ అంటే సినిమా హీరోలా గ్లామర్ గా ఉంటారు అని మాజీ సీఎం జగన్ పొగిడారు. అది అక్షరాల నిజమే. ఎందుకంటే వంశీ చాలా చక్కగా కత్తిరించిన జుట్టుని మెయింటైన్ చేస్తూ గ్లామర్ లుక్ కలిగి ఉంటాడు. అతను ఎప్పుడూ జుట్టుకు నల్లగా రంగు వేస్తూ క్లీన్ షేవ్ తో సూపర్ అన్నట్లుగానే కనిపిస్తారు.

అందుకే జగన్ వంశీ అరెస్ట్ అయిన తరువాత జైలులో ములాఖత్ చేసుకుని వచ్చి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు లోకేష్ కంటే వంశీ అందంగా ఉంటారనే వారికి అసూయ అన్నారు. ఆయన అందుకే అరెస్ట్ అయ్యారని కూడా వ్యాఖ్యానించారు. తన సామాజిక వర్గం నుంచి ఎవరైనా తన కంటే గ్లామర్ గా ఉంటే చంద్రబాబు భరించలేరని కూడా జగన్ అన్నారు.

సరే అప్పటికి వంశీ అలాగే ఉన్నారు కానీ నెల రోజులకు పైగా జైలు జీవితం చూశాక ఇపుడు విచారణ పేరుతో కోర్టుకు వస్తున్న వంశీని చూస్తే జగన్ గ్లామర్ మాటలు ఎక్కడా నప్పవు. ఎందుకంటే వంశీ ఇపుడు వేరేగా ఉన్నారు.

ఆయన అభిమానులు సైతం ఆశ్చర్యపోయేలా ఆవేదన చెందేలా ఆయన రూపం ఉంది. తాజాగా వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌కు సంబంధించి ఆయనను కోర్టులో హాజరు పరుస్తున్నప్పుడు ఆయన అభిమానులు కోర్టు వెలుపల గుమిగూడారు. ఆ సమయంలో వంశీ రూపాన్ని చూసి అభిమానులు బిత్తరపోయారు.

జైలులో గడుపుతున్న వంశీలో గ్లామర్ ఎక్కడా కనిపించలేదు. ఆయన జుట్టు స్పష్టంగా తెల్లగా ఉంది అలాగే ముఖంలో ఆకర్షణ కూడా లేదు. అలా బయటకు వంశీ కనిపించడం ఇదే తొలిసారి కూడా కావచ్చు అని అంటున్నారు. వంశీకి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అన్నది చూస్తే కనుక జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు కుటుంబంపై ఆయన ఉపయోగించిన అత్యంత జుగుప్సాకరమైన భాష వల్లనే అని అంటున్నారు.

ఆయన మీద వేరే కేసులు ఉన్నా ఇది మాత్రం ప్రధానంగా ఆయనను ఇబ్బంది పెట్టింది అని అంటున్నారు. ఏది ఏమైనా వంశీ కాలానికి చిక్కిన బాధితుడిగా ఉన్నారు. జైలు గోడల మధ్య ఆయన మగ్గుతున్నారు. ఆయన మీద పెట్టిన కేసులలో బెయిల్ ఎపుడు వస్తుందో తెలియదు అని అంటున్నారు.

ఒకనాటి ధైర్యం అన్నది ఇపుడు సడలిపోయింది. ఆయనలో సైతం ఇదివరకు ధీమా కనిపించడం లేదు. అందుకే ఆయన అనుచరులు కానీ అభిమానులు కానీ అన్నా, దయచేసి మీ ముఖం చూసుకోండి. మీరు చాలా మారిపోయారన్నా అని బాధతో అన్న మాటలు వినిపించాయి.

కొందరు అభిమానులు అయితే వంశీ బుగ్గలు నిమిరి తమ ప్రేమను చాటుకున్నారు. అన్నా ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావో అని వారు అంటూంటే వంశీ సైతం ఆవేదనను బలవంతంగా ముఖంలోనే దాచుకున్నారు. ఆయన మౌనంగా తన కోసం వచ్చిన వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగిపోయారు.

ఇవన్నీ రాజకీయాల్లో కామన్ అని అనుకోకూడదు. అధికారంలో ఉన్నపుడు కానీ లేనప్పుడు కానీ తమ దూకుడు విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించుకుంటే ఎవరికీ ఈ పరిస్థితి రాదని అంటున్నారు. వంశీ విషయం అయితే ఆయనతో పాటు ఎవరూ కలలో కూడా అనుకోని స్థితి ఇది. మొత్తానికి వంశీ గ్లామర్ అని హీరో అని జగన్ ఏ ముహూర్తాన అన్నరో కానీ ఆ గ్లామర్ అంతా నీరు కారిపోగా బేలగా ఆయన కనిపిస్తున్న సన్నివేశాలు అభిమానులకు అయితే ఇబ్బందికరంగానే ఉన్నాయని అంటున్నారు.