వైసీపీ ఎంపీకి పవన్ ఆఫర్ చేసిన సీటు ఇదేనా?
మచిలీపట్నం ఎంపీగా ఉన్న వల్లభనేని బాలశౌరి వైసీపీకి రాజీనామా ప్రకటించిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 17 Jan 2024 4:30 PM GMTమచిలీపట్నం ఎంపీగా ఉన్న వల్లభనేని బాలశౌరి వైసీపీకి రాజీనామా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాను జనసేన పార్టీలో చేరుతున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో బాలశౌరిని తిరిగి మచిలీపట్నం ఎంపీగా జనసేన పార్టీ తరఫున బరిలోకి దింపుతారని వార్తలు వచ్చాయి. లేదంటే గుంటూరు ఎంపీగా పవన్ ఆయనకు అవకాశమిస్తారని టాక్ నడించింది.
అయితే వల్లభనేని బాలశౌరి ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన కృష్ణా జిల్లాలోని పెడన అసెంబ్లీ నియోజకవర్గం సీటును ఆశిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. కాపు సామాజికవర్గం ఈ నియోజకవర్గంలో అత్యధికంగా ఉంది. ఈ క్రమంలో ఈ సీటును బాలశౌరి ఆశిస్తున్నారని చెబుతున్నారు.
2019లో ఒంటరిగా పోటీ చేసిన జనసేన పార్టీకి పెడనలో దాదాపు 26 వేల ఓట్లు వచ్చాయి. అయితే ఈసారి టీడీపీతో కలిసి పోటీ చేస్తుండటంతో పెడనలో ఈసారి గెలుపొందవచ్చని ఆ పార్టీ లెక్కలేసుకుంటోంది. మరోవైపు నిన్నమొన్నటి వరకు పెడనలో జనసేన పార్టీ తరఫున అంతా తానై వ్యవహరించిన రామ సుధీర్ ... వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. దీంతో పెడనలో జనసేన పార్టీకి గట్టి అభ్యర్థులు లేకుండా పోయారు.
దీంతో వల్లభనేని బాలశౌరిని దించితే పెడన సీటును గెలుచుకోవచ్చని జనసేన భావిస్తోంది. బాలశౌరి అటు సామాజికంగా, ఆర్థికంగా బలమైనవారు. దీంతో ఆయనే సరైన అభ్యర్థిని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక టీడీపీ తరఫున గతంలో కాగిత వెంకట్రావు పెడన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా, మంత్రిగానూ ఆయన గతంలో విధులు నిర్వర్తించారు. అయితే ఆయన మరణించాక ఆయన తనయుడు కాగిత కృష్ణప్రసాద్ టీడీపీ తరఫున ఇంచార్జిగా ఉన్నారు. అయితే ఆయన తన తండ్రి అంత చురుకైన వ్యక్తి కాదని అంటున్నారు.
ఈ నేపథ్యంలో పెడన అసెంబ్లీ సీటును పొత్తులో భాగంగా జనసేన పార్టీకి కేటాయించడానికి చంద్రబాబు సైతం అంగీకరించారని టాక్ నడుస్తోంది. అందులోనూ బాలశౌరి లాంటి బలమైన అభ్యర్థి అయితే విజయావకాశాలు ఉంటాయని భావిస్తున్న పవన్ ఆయననే పెడన నుంచి బరిలోకి దింపడానికి నిశ్చయించారని చెబుతున్నారు.
ఇక అధికార వైసీపీ ఇప్పటికే పెడనకు అభ్యర్థిని ప్రకటించింది. కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న ఉప్పాల హారిక భర్త ఉప్పాల రాముకు సీటు ఇచ్చింది.