బాలశౌరి పోటీ ఎక్కడ నుంచి?
కాగా ఈ నేపథ్యంలో బాలశౌరి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది
By: Tupaki Desk | 14 Jan 2024 10:06 AM GMTవచ్చే ఎన్నికల్లో మరోసారి విజయం సాధించడమే లక్ష్యంగా ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేస్తున్న మార్పులు చేర్పులు ఆ పార్టీలో కలకలానికి దారితీస్తున్న సంగతి తెలిసిందే. ఈ మార్పులు నచ్చని పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు వైసీపీకి రాజీనామాలు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మచిలీపట్నం వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి వైసీపీకి రాజీనామా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాను జనసేన పార్టీలో చేరుతున్నానని ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు.
కాగా ఈ నేపథ్యంలో బాలశౌరి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. జనసేన పార్టీ తరఫున గుంటూరు లేదా మచిలీపట్నం నుంచి ఆయన పోటీ చేయొచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే గుంటూరు ఎంపీ సీటును తమకే వదిలేయాలని టీడీపీ కోరుతోంది. 2014, 2019ల్లో గుంటూరు ఎంపీ స్థానంలో టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఈసారి కూడా ఈ సీటును తమకే వదిలేయాలని టీడీపీ కోరుతోంది.
గుంటూరు కుదరదనుకుంటే వల్లభనేని బాలశౌరిని ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మచిలీపట్నం స్థానం నుంచే బరిలో దింపొచ్చని అంటున్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ఓటర్లు ఎక్కువ. బాలశౌరి కూడా కాపు సామాజికవర్గానికి చెందినవారే. ఈ నేపథ్యంలో మచిలీపట్నం నుంచే జనసేన పార్టీ తరఫున బాలశౌరి బరిలో దిగొచ్చని చెబుతున్నారు. అలాగే గుంటూరు/మచిలీపట్నం స్థానాలతోపాటు ఏలూరు నుంచి బరిలో దింపితే ఎలా ఉంటుందని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. తాజాగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీలోనూ ఈ అంశం చర్చకు వచ్చినట్టు చెబుతున్నారు.
కాగా 2004లో గుంటూరు జిల్లా తెనాలి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా వల్లభనేని బాలశౌరి గెలుపొందారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో తెనాలి పార్లమెంటరీ నియోజకవర్గం రద్దు కావడంతో ఆ ఎన్నికల్లో నరసరావుపేట నుంచి ఎంపీగా బరిలో దిగారు. అయితే ఆ ఎన్నికల్లో బాలశౌరి టీడీపీ తరఫున పోటీ చేసిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి చేతిలో కేవలం 1607 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
ఇక 2014లో వైసీపీ తరఫున గుంటూరు నుంచి బరిలోకి దిగి బాలశౌరి పరాజయం పాలయ్యారు. 2019లో మళ్లీ నియోజకవర్గం మార్చి కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి ఎంపీగా గెలుపొందారు.
వల్లభనేని బాలశౌరి ఇప్పటివరకు నాలుగు ఎన్నికల్లో పోటీ చేయగా నాలుగుసార్లు వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేయడం విశేషం. నాలుగు ఎన్నికల్లో రెండుసార్లు గెలిచిన బాలశౌరి మరో రెండుసార్లు ఓడిపోయారు.