Begin typing your search above and press return to search.

వల్లభనేని వంశీపై కేసు నమోదు... సెక్షన్స్ ఇవే!

గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   11 July 2024 10:59 AM GMT
వల్లభనేని వంశీపై కేసు నమోదు... సెక్షన్స్  ఇవే!
X

గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో వీటికి సంబంధించిన కేసుల దర్యాప్తును పక్కన పెట్టిన పోలీసులు.. తాజాగా ప్రభుత్వం మారడంతో నిందితుల అరెస్టులకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది! ఇందులో భాగంగా గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడికి సంబంధించిన ఘటనలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేశారు.

అవును... గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి చేసిన కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు కోర్టుకు నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలో వంశీని 71వ నిందితుడిగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఆయన అరెస్ట్ ఉండొచ్చని అంటున్నారు. దీనికి కోసం సర్వం సిద్ధం అవుతోందని సమాచారం! ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారని అంటున్నారు!

గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేసే ఆపరేటర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ సెక్షన్ 143, 147, 148, 135, 506 రెడ్ విత్ 149, సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఇప్పటికే సుమారు 15 మందిని గన్నవరం అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు.. మిగిలినవారి కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారని తెలుస్తోంది.

కాగా... ఈ ఏడాది ఫిబ్రవరి 20న గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై నాటి స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు, వైసీపీ నాయకులు దాడి చేసి, నిప్పు పెట్టారు. ఇదే సమయంలో ఆఫీసులోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. ఈ సమయంలో పలువురు సిబ్బందికి, టీడీపీ నేతలకు గాయాలయ్యాయి. ఈ సందర్భంగా టీడీపీ నేతల వాహనాలనూ ధ్వంసం చేశారు. నాలుగైదు గంటల్లో విధ్వంసం సృష్టించడంతో.. స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.

అయితే ఈ కార్యక్రమం అంతా నాటి స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రోద్భలంతోనే జరిగిందనే చర్చ బలంగా నడిచింది. అయినప్పటికీ అప్పట్లో పోలీసులు టీడీపీ నేతలపైనే కేసులు నమోదు చేశారు. అయితే తాజాగా ఈ ఘటనపై గన్నవరం టీడీపీ ఆఫీసు ఆపరేటర్ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆఫీసుపై దాడికి పాల్పడిన వారిని సీసీ కెమెరాలు, వీడియోల ద్వారా గుర్తించారని, 71 మంది దాడికి పాల్పడినట్లు నిర్ధారించారని అంటున్నారు.