కీలక కేసు.. వంశీ అరెస్టు తప్పదా?
కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అరెస్టుకు రంగం సిద్ధమైందా అంటే అవుననే అంటున్నారు
By: Tupaki Desk | 2 Aug 2024 7:15 AM GMTకృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అరెస్టుకు రంగం సిద్ధమైందా అంటే అవుననే అంటున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గన్నవరంలో టీడీపీ కార్యాలయాన్ని వైసీపీ శ్రేణులు ధ్వంసం చేసి తగులబెట్టాయి. పలువురు టీడీపీ నేతలపై దాడులు కూడా జరిగాయి, నాడు ఈ వ్యవహారంపై పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదనే అభియోగాలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో నిందితులంతా వల్లభనేని వంశీ అనుచరులు కావడంతో వారిని వదిలేశారనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిందితులపై చర్యలు చేపట్టింది. గన్నవరంలో టీడీపీ కార్యాలయం ధ్వంసం, దహనం కేసులకు సంబంధించి పలువురు వైసీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయినవారిలో బాపులపాడు మండల పరిషత్ అధ్యక్షుడు నగేశ్ కూడా ఉన్నాడు.
కాగా ఈ కేసులో ఇప్పటివరకు వల్లభనేని వంశీని అరెస్టు చేయలేదు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గన్నవరంలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత నుంచి ఆయన హైదరాబాద్ లోనే ఉంటున్నారని చెబుతున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక విజయవాడలో వల్లభనేని వంశీ ఉండే అపార్టుమెంటుపైకి కొందరు రాళ్లు రువ్వారు. దీంతో వల్లభనేని వంశీ కుటుంబంతో సహా హైదరాబాద్ వెళ్లిపోయారని అంటున్నారు.
వాస్తవానికి హైదరాబాద్ లో కూడా వంశీ లేరని.. ఆయన అమెరికా వెళ్లిపోయారని చెబుతున్నారు. కాగా టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి వల్లభనేని వంశీని పోలీసులు 71వ ముద్దాయిగా చేర్చారు. ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి 18 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
కాగా ప్రత్యక్షంగా, నేరుగా టీడీపీ కార్యాలయంపై దాడిలో వంశీ పాల్గొనలేదని చెబుతున్నారు. అయితే తన అనుచరులు ఉసిగొల్పి దాడులు చేయించారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. వల్లభనేని వంశీ అండ చూసుకునే వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయని అంటున్నారు.
మే వరకు వైసీపీ అధికారంలో ఉండటంతో వంశీపైనా, ఆయన మనుషులపైనా ఈగ కూడా వాలలేదు. నిందితులంతా స్వేచ్చగా తిరిగారు. ఈ క్రమంలో జూన్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిందితులపైన దృష్టి సారించింది. ఈ క్రమంలోనే పోలీసులు 18 మందిని అరెస్టు చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు అయినా ఇంతవరకు వల్లభనేని వంశీని అరెస్టు చేయకపోవడంతో టీడీపీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూడు పోలీసు బృందాలు తాజాగా హైదరాబాద్ వెళ్లాయి. అయితే వల్లభనేని వంశీ అక్కడ కూడా లేరని.. అమెరికా చెక్కేసి ఉంటారని అంటున్నారు.