పవన్ విమర్శలపై వల్లభనేని వంశీ వివరణ కమ్ సెటైర్లు ఇవే!
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గరపడుతున్న వేళ ఏపీ రాజకీయాలు మహ రంజుగా మారుతున్నాయనే కామెంట్లను సొంతం చేసుకుంటున్నాయి
By: Tupaki Desk | 9 May 2024 10:50 AM GMTసార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గరపడుతున్న వేళ ఏపీ రాజకీయాలు మహ రంజుగా మారుతున్నాయనే కామెంట్లను సొంతం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఏర్పాటు చేసిన వారహి సభలో గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ప్రధానంగా నారా భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలు తనకు బాధకలిగించాయని అన్నారు.
అవును... గన్నవరంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... వంశీ వివేకం కలిగిన నాయకుడని తాను అనుకున్నానని.. పాలసీలపరంగా విభేదాలుంటే మాట్లాడవచ్చని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిపై వంశీ చేసిన వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయని అన్నారు. వంశీకి జనసేన శ్రేణులు ఓట్లు వేస్తే అవి మహిళను అగౌరపరిచే వారిని ప్రోత్సహించటం అవుతుందని వ్యాఖ్యానించారు.
దీంతో తాజాగా పవన్ కల్యాణ్ తనపై చేసిన వ్యాఖ్యలపై వంశీ స్పందించారు. ఇందులో భాగంగా రాజకీయ పార్టీ అధినేతగా ఉన్న పవన్ కల్యాణ్ ఏదైనా విషయంపై పక్కాగా సమాచారం తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. ఇదే సమయంలో ఎవరో చెప్పిన మాటలు విని గోబెల్స్ ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా... తాను నారా భువనేశ్వరిని ఏనాడూ ఒక్కమాట కూడా అనలేదని.. తాను అన్నట్లు మీరు విన్నారా.. చూశారా.. అని నిలదీశారు. లోకేష్ మాత్రం తనపైనా, తన కుంటుంబ సభ్యులపైనా ఐటీడీపీతో సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు రాయించాడని.. అటువంటి సంస్కృతి మంచిది కాదని అన్నారు.
ఇదే సమయంలో... తాను అసెంబ్లీలో నారా భువనేశ్వరి గురించి మాట్లాడినట్లు పవన్ అంటున్నారని.. అసలు ఆరోజు తాను అసెంబ్లీలోనే లేనని.. ఐఎస్బీ మొహాలీలో కోర్సు కోసం పంజాబ్ లో ఉన్నట్లు తెలిపారు. పవన్ మాటలు హాస్యాస్పద మని, ఎవరో చెప్పిన మాటలు విని పవన్ మాట్లాడటం ఏమాత్రం సరికాదని.. తాను అనని మాటలు తనకు ఆపాదించారని వంశీ తెలిపారు. అసలు ఎన్టీఆర్, సోనియాలపై అనుచిత వ్యాఖ్యలు చేసింది చంద్రబాబు అని వంశీ అన్నారు!