9 నెలల వేట.. కిడ్నాప్ కేసుతో ముగిసిన ఆట.. వంశీ కేసులో ఎన్నో ట్విస్టులు
మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టుతో 9 నెలల పోలీసు వేట ముగిసింది.
By: Tupaki Desk | 13 Feb 2025 10:17 AM GMTమాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టుతో 9 నెలల పోలీసు వేట ముగిసింది. కూటమి ప్రభుత్వ పెద్దల పంతం నెగ్గిందని, గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో 71వ నిందితుడిగా ఉన్న వంశీని అరెస్టు చేసేందుకు ప్రభుత్వ పెద్దలు పకడ్బందీగా వ్యూహం రచించారని ప్రచారం జరుగుతోంది. 9 నెలలుగా అండర్ గ్రౌండులో గడుపుతున్న వంశీ అనూహ్యంగా పోలీసులకు చిక్కడం వెనుక పక్కా స్కెచ్ ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గన్నవరం కేసు పెట్టిన సత్యవర్థన్ తన ఫిర్యాదును ఉపసంహరించుకుంటున్నానని మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చిన రెండు రోజుల్లోనే వంశీ కేసుపై ప్రభుత్వ పెద్దల జోక్యం చేసుకోవడంతో వ్యవహారం ఊహించని మలుపు తిరిగిందని టాక్ వినిపిస్తోంది.
2019లో టీడీపీ నుంచి గెలిచిన వంశీ.. మధ్యలోనే పార్టీ మారారు. ఆయనతోపాటు నలుగురు ఎమ్మెల్యేలు అప్పుడు ఫ్యాన్ పార్టీ గూటికి చేరినా, మిగిలిన వారు పెద్దగా వార్తల్లో లేరు. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి వంశీ ప్రధాన టార్గెట్ గా మారారు. ఆయన కోసం ఒకవైపు పోలీసులు, మరోవైపు టీడీపీ కార్యకర్తలు చాలా కాలం వేట సాగించారు. అయితే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ71గా అభియోగాలు ఎదుర్కొంటున్న వంశీకి గతంలో ముందస్తు బెయిల్ మంజూరైంది. కానీ, ఇదే సమయంలో తనను కులంపేరుతో దూషించారని టీడీపీ ఆఫీసు కంప్యూటర్ అసిస్టెంట్ సత్యవర్థన్ కేసు పెట్టడంతో ఎస్సీఎస్టీ కేసు నమోదైంది. ఈ కేసులో కూడా వంశీ ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేశారు. ఈ నెల 20న ఈ కేసు విచారణకు రానుంది. ఆయనకు బెయిల్ వస్తుందో లేదో కోర్టులో తేలుతుంది. కానీ, అనూహ్యంగా వంశీపై కేసు పెట్టిన సత్యవర్థన్ తన ఫిర్యాదును వెనక్కి తీసుకోవడం సంచలనంగా మారింది. బాధితుడు ఫిర్యాదును ఉపసంహరించుకోవడంతో వంశీ సేఫ్ అంటూ వైసీపీ సోషల్ మీడియాను హోరెత్తించింది. ఇది కూటమికి పెద్దగా దెబ్బగా విశ్లేషణలు వెలువడ్డాయి. అయితే సరిగ్గా ఇక్కడే కూటమి నేతలు చాకచక్యంగా పావులు కదిపారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సడన్ గా బాధితుడు ఫిర్యాదు వెనక్కి తీసుకోవడంపై ఆరా తీయగా, కిడ్నాప్ కేసు వెలుగుచూసింది.
వంశీపై నమోదైన కేసుల్లో ఒక కేసులో ముందస్తు బెయిల్ మంజూరైంది. మరో కేసులో ముందస్తు బెయిలుపై విచారణ జరుగుతోంది. ఇదే సమయంలో అరెస్టు నుంచి ఆయన రక్షణ పొందుతున్నాడు. అయితే వంశీని ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్టు చేయించాలనే లక్ష్యంతో నడుచుకుంటున్న ప్రభుత్వ పెద్దలు.. కిడ్నాప్ కేసును అత్యంత గోప్యంగా దాచిపెట్టినట్లు చెబుతున్నారు. విషయం వెలుగు చూసిన వెంటనే వంశీ ఆచూకీ కనుగొని ఆగమేఘాలపై అరెస్టు చేయించారు. దీంతో 9 నెలలుగా వంశీ కోసం కొనసాగుతున్న వేట ముగిసింది. ప్రస్తుతం కిడ్నాప్ కేసులో అరెస్టు అయిన వంశీపై మరిన్ని కేసుల కత్తి వేలాడుతోంది. ఇవన్నీ సీరియల్ గా కొనసాగించే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు.
మాజీ ఎమ్మెల్యే వంశీపై అనేక కేసులు నమోదైనట్లు పోలీసులు చెబుతున్నారు. బాపులపాడు మండలం ఆరుగొలనులో టీడీపీ నేత వేములపల్లి శ్రీనివాసరావు దుకాణాలు కూల్చివేసిన కేసులో వంశీ ఏ2గా ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై హత్యాయత్నం కేసు, గన్నవరం పీఏసీఎస్ అధ్యక్షుడు కాసరనేని రంగబాబుపై దాడి కేసు, హనుమాన్ జంక్షనులో నకిలీ ఇళ్ల పట్టాల కేసుల్లో వంశీ నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. ఇక చెరువులు, పోలవరం గట్లపై మట్టిని అక్రమంగా తవ్వించి తరలించానే ఆరోపణలు వంశీపై ఉన్నాయి. మొత్తానికి వంశీ అరెస్టుతో కూటమి నేతల పంతం నెగ్గినట్లైంది. టీడీపీ కార్యకర్తలను శాంతి పరిచేలా జరిగిన ఈ అరెస్టు.. నెక్ట్స్ ఎవరన్న కొత్త చర్చకు తెరలేపింది.