వంశీ మరోసారి అరెస్టు.. అందుకే పీటీ వారెంట్?
ఇటీవల వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టువేయడంతో తాజా అప్డేట్ హీట్ పుట్టిస్తోంది.
By: Tupaki Desk | 24 Feb 2025 8:09 AM GMTవైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మరోకేసులో అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కిడ్నాప్ కేసులో విజయవాడ జైలులో రిమాండులో ఉన్న వంశీపై పోలీసులు పీటీ వారెంట్ (Prisoner Transit warrant) జారీ చేశారు. ఆయనను మంగళవారం కోర్టులో హాజరుపర్చాల్సిందిగా మూడో అదనపు జిల్లా జడ్జి ఆదేశించారు. ఏదైనా కేసులో నిందితుడిని మరో కేసులో అరెస్టు చేయాల్సివస్తే పోలీసులు పీటీ వారెంట్ జారీ చేస్తారు. ఇటీవల వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టువేయడంతో తాజా అప్డేట్ హీట్ పుట్టిస్తోంది.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీని అంత తేలిగ్గా వదిలే పరిస్థితి లేదని ప్రభుత్వ వర్గాలు సంకేతాలు పంపుతున్నాయంటున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీసులో దాడి కేసుతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో వంశీపై పీటీ వారెంటు చేయడం ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. నిందితుడు వంశీ ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసుకున్న పిటిషన్ ను కోర్టు కొట్టివేయడంతో ఆయనను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ప్రస్తుతం కిడ్నాప్ కేసులో రిమాండులో ఉన్న వంశీ రిమాండ్ రేపటితో ముగియనుందని అంటున్నారు. ఈ కేసులో రిమాండు పొడిగించడంతోపాటు మరో కేసులో అరెస్టు చూపి ఆయనకు బెయిల్ రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీతోపాటు మరో 36 మంది నిందితుల ముందస్తు బెయిల్ పిటిషన్లను కోర్టు గతంలోనే కొట్టివేసింది. కేసు విచారణ జరుపుతున్న ఎస్పీ, ఎస్టీ న్యాయస్థానంలో కూడా నిందితులకు ఊరట దక్కలేదు. దీంతో నిందితులను ఎట్టిపరిస్థితుల్లోనూ అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కాగా, గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీతోపాటు మొత్తం 88 మంది నిందితులుగా ఉన్నారు. అప్పట్లో కార్యాలయం కంప్యూటర్ ఆపరేటర్ గా ఉన్న సత్యవర్థన్ దాడితోపాటు, తనను కులం పేరుతో దూషించారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు సత్యవర్థన్ ను కిడ్నాప్ చేశారనే ఆరోపణలతో వంశీని పోలీసులు ఈ నెల 13న అరెస్టు చేసిన విషయం తెలిసిందే.