Begin typing your search above and press return to search.

పోలీసుల ప్రశ్నలకు వంశీ.. పోసాని తీరులో తేడా ఎంత?

సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో ఇప్పటికే మూడు రోజులుగా ప్రశ్నలు ఎదుర్కొన్న వంశీ.. చాలా వాటికి గుర్తు లేదని.. కొన్నింటికి ఔనని.. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా ఉండటం లాంటివి చేశారు.

By:  Tupaki Desk   |   28 Feb 2025 4:37 AM GMT
పోలీసుల ప్రశ్నలకు వంశీ.. పోసాని తీరులో తేడా ఎంత?
X

కేసుల విచారణలో వైసీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఓవైపు సత్యవర్థన్ ను బెదిరించిన కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మరోవైపు చంద్రబాబు నాయుడు.. లోకేశ్, పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేయటం.. దారుణ రీతిలో బూతులు తిడుతూ మాట్లాడిన మాటలకు కేసులు ఎదుర్కొంటున్నారు సినీ ప్రముఖుడు పోసాని క్రిష్ణ మురళి. వీరిద్దరూ గురువారం పోలీసుల విచారణ ఎదుర్కొన్నారు. ప్రశ్నల పరంపరకు తమదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. ఒకే సందర్బంలో ఒకే పార్టీకి చెందిన ప్రముఖులు విచారణను ఎదుర్కోవటం.. ఈ సందర్భంగా ఇద్దరి వైఖరి ఒకేలా ఉండటం ఆసక్తికరంగా మారింది.

సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో ఇప్పటికే మూడు రోజులుగా ప్రశ్నలు ఎదుర్కొన్న వంశీ.. చాలా వాటికి గుర్తు లేదని.. కొన్నింటికి ఔనని.. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా ఉండటం లాంటివి చేశారు. ఆయన ఫోన్ గురించి అడిగితే తెలీదని చెప్పిన ఆయన.. ఒక కీలక ప్రశ్నకు మాత్రం సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 12న హైదరాబాద్ నుంచి వచ్చి జగన్ ను కలిసినట్లుగా పోలీసులు ప్రశ్నించగా.. అందుకు అవునని బదులిచ్చారు. మొత్తంగా మూడు రోజుల విచారణలో వంశీ నుంచి కీలక సమాచారాన్ని సమాధానాలుగా పోలీసులకు లభించలేదన్న మాట వినిపిస్తోంది.

మరోవైపు బుధవారం రాత్రి హైదరాబాద్ లో అరెస్టు అయిన పోసాని క్రిష్ణమురళి.. గురువారం దాదాపు ఏడు గంటల పాటు పోలీసు విచారణను ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన వ్యవహరించిన వైఖరి పోలీసులకు కాస్తంత సిత్రంగా అనిపించినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు. పవన్ కల్యాణ్. లోకేశ్ లను తీవ్ర పదజాలంతో బూతులు తిట్టే వీడియోలను చూపించిన సందర్భంగా లవ్యూ రాజా అని సమాధానం ఇవ్వటం.. చాలా ప్రశ్నలకు తెలీదని.. తనకు గుర్తు లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది.

పోలీసులు చూపించిన వీడియోల్లోని బూతు మాటలన్నీ తనవేనని.. తాను తప్పు చేశానని.. అలా మాట్లాడి ఉండకూదని.. అందుకు తాను ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నట్లుగా పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఇంతకు మించి తాను చేసేది.. చెప్పేది ఏమీ లేదని సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పోసానిని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విచారించారు. ఇద్దరు ఇన్ స్పెక్టర్ల సమక్షంలో ఆయన విచారణ జరిపారు.

విచారణ మొదట్లో ఏ ప్రశ్న అడిగినా తెలీదు.. గుర్తు లేదన్న ఆయన.. బూతులు మాట్లాడిన వీడియోలన్నీ చూపించిన తర్వాత.. ఇది చట్టవిరుద్ధం కాదా? అని ప్రశ్నించగా.. ప్రతి దానికీ లవ్యూ రాజా అంటూ బదులిచ్చారు. దీంతో దర్యాప్తు అధికారులు లోతుగా ప్రశ్నించగా.. తాను నేరం చేసినట్లు అంగీకరించినట్లుగా తెలుుస్తోంది. చంద్రబాబు.. పవన్.. లోకేశ్ లను ఎందుకు తిట్టాల్సి వచ్చింది? వారి కుటుంబ సభ్యుల్ని అనుచితంగా మాట్లాడాలని ఎవరైనా ప్రోత్సహించారా? స్క్రిప్టు ఎవరైనా ఇచ్చారా? అని ప్రశ్నించగా అందుకు మౌనంగా ఉన్నట్లుగా సమాచారం.

కొన్ని సందర్భాల్లో మాత్రం అవును రాజా.. చెప్పుడు మాటలు విన్నట్లుగా పోలీసుల ఎదుట వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. తన వ్యాఖ్యల వ్యవహారం ఇంతవరకు వస్తుందని తనకు తెలీదని.. అందుకే తప్పు జరిగినట్లుగా పోలీసులకు చెప్పినట్లుగా సమాచారం.