తూర్పు వంశీకి రాజకీయ సిరి ఉందా ?
ఇక 2024 ఎన్నికలలో చూస్తే విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు వైసీపీ అధినాయకత్వం విశాఖ తూర్పు టికెట్ ఇచ్చేసింది.
By: Tupaki Desk | 22 April 2024 4:05 AM GMTవిశాఖ తూర్పు నియోజకవర్గాన్ని తన స్థావరంగా చేసుకుని రెండు ఎన్నికల్లో వరసగా రెండు పార్టీల నుంచి పోటీ చేసినా ఎమ్మెల్యే కాలేకపోయారు వంశీకృష్ణ శ్రీనివాస్. ఆయన 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేస్తే జస్ట్ మూడు వేల తేడాతో ఓటమిని చూశారు. అదే వంశీ వైసీపీ నుంచి 2014లో పోటీ చేస్తే ఏకంగా 47 వేల భారీ తేడాతో ఓటమి పాలు అయ్యారు. 2019 నాటికి అంతా అనుకూలం అనుకుంటే ఆయనకు టికెట్ దక్కలేదు. ఆ ప్లేస్ లోకి కొత్తగా వచ్చిన అక్రమాని విజయనిర్మలకు టికెట్ ఇచ్చేశారు. అలా జగన్ ప్రభంజనంలో గెలిచే అవకాశం ఉంటే టికెట్ దక్కలేదు.
ఇక 2024 ఎన్నికలలో చూస్తే విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు వైసీపీ అధినాయకత్వం విశాఖ తూర్పు టికెట్ ఇచ్చేసింది. దాంతో వంశీ విసిగిపోయి జనసేనలో చేరారు. అయితే జనసేన టీడీపీ పొత్తు కాబట్టి సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబుని కదపడం కష్టం కాబట్టి వంశీకి విశాఖ దక్షిణం సీటుని చూపించారు. కానీ ఆ సీటుకు ఆయన కొత్త.
దాంతో పాటు జనసేనలో ఉన్న నేతలు అంతా వంశీ రాక మీద తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వచ్చారు వారంతా వరసబెట్టి వైసీపీలో చేరిపోయారు. సౌత్ లో జనసేన కోసం పాటుపడిన కీలక నేతలు ఇపుడు వైసీపీ జెండా పట్టుకున్నారు. టీడీపీకి గట్టి పట్టు ఉన్న ఈ సీటులో ఆ పార్టీ సహకారం కూడా అంతంతమాత్రంగా ఉంది.
దాంతో వంశీ విశాఖ దక్షిణం నుంచి గెలవడం మీద కూటమిలోనే చర్చ సాగుతోంది. జనసేన నేతలు వంశీని తమవాడిగా భావించకపోగా జెండా ఏనాడూ పట్టుకోని నేతకు టికెట్ ఇస్తారా అని హై కమాండ్ మీద మండిపడ్డారు. వారిలో కొందరు సైలెంట్ గా ఉంటున్నారు.
విశాఖ దక్షిణంలో అయితే వంశీ దాదాపుగా ఒంటరి పోరు చేస్తున్నారు అని అంటున్నారు. ఆయన ఎమ్మెల్యే కావాలని పార్టీ జంప్ చేసి మరీ జనసేనలో చేరారు. కానీ టికెట్ దక్కింది గెలుపు ధీమా అయితే కనిపించడం లేదు అంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ నుంచి పోటీ చేస్తున్న వాసుపల్లి గణేష్ కుమార్ కి సామాజిక బలంతో పాటు గతంలో మూడు సార్లు పోటీ చేసిన అనుభవం ఉండడంతో ఆయన సులువుగా ఎన్నికలలో దూసుకుపోతున్నారు.
పైగా జనసేన మీద దృష్టి పెట్టి అసంతృప్తి నేతలను ఆయన వైసీపీలోకి తీసుకుని వస్తున్నారు. ఇంకో వైపు విశాఖ సౌత్ లో బీసీలు మైనారిటీలు ఎక్కువ వారి మద్దతు వైసీపీకి దక్కుతోంది. మైనారిటీలు టీడీపీ కూటమికి మద్దతు ఇవ్వమని చెబుతున్నారు. అందులో బీజేపీ ఉందని వారు వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిణామాలు అన్నీ వంశీ వర్గాన్ని కలవరపెడుతున్నాయి. వంశీ ఈసారి ఇన్ని ఇబ్బందులను తట్టుకుని మరీ గెలిస్తే కనుక ఆయన అంత రాజకీయ అదృష్టవంతుడు వేరొకరు ఉండరని అంటున్నారు. వంశీ రాజకీయాన్ని విశాఖ సౌత్ ఏ దిక్కుకు చేరుస్తుంది అన్న ఉత్కంఠ అయితే జనసేనలోనూ ఆయన అభిమానులలోనూ ఉంది.