పెనుమలూరు సీటు నాకు వద్దు అంటున్న వల్లభనేని వంశీ...!?
పెనమలూరు నుంచి సీనియర్ నేత మాజీ మంత్రి పార్ధసారధి 2019 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు.
By: Tupaki Desk | 29 Dec 2023 5:30 PM GMTవైసీపీ అధినాయకత్వం సీట్ల విషయంలో చేస్తున్న మార్పులు చేర్పులు అన్నీ కూడా గ్రౌండ్ లెవెల్ లో వేరే సౌండ్ చేస్తున్నాయి. కొందరుకి మోదంగా ఉంటే కొందరికి ఇబ్బందిగా ఉంటోంది అని అంటున్నారు. పెనమలూరు నుంచి సీనియర్ నేత మాజీ మంత్రి పార్ధసారధి 2019 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. నిజానికి ఆయన మంత్రి పదవి తనకు కచ్చితంగా వస్తుందని భావించారు
అయితే తొలి విడతలో దక్కలేదు. పోనీ మలి విడతలో అయినా ఇస్తారని అనుకుంటే అది కూడా లేకుండా పోయింది. మొత్తం ఉమ్మడి కృష్ణా జిల్లాకు ఒకే ఒక మంత్రిగా జోగి రమేష్ ని ఎంపిక చేసి తీసుకున్నారు. దాంతో పార్ధసారధి నిరాశకు గురి అయ్యారు. ఆ తరువాత ఆయన సర్దుకున్నా ఇపుడు చూస్తే ఆయన సీటుకే ఎసరు వస్తోంది అని అంటున్నారు.
పెనమలూరులో సామాజిక సాధికార యాత్ర వేళ పార్ధసారధి తన మదిలో బాధను వ్యక్తం చేశారు. తనకు అందరూ అభిమానులే అని ప్రజలు కూడా తనను అర్ధం చేసుకున్నారని కానీ జగన్ అర్ధం చేసుకోలేదని వాపోయారు. అంటే ఆయనకు కూడా తన సీటు పోతోందని తెలుసు అని అంటున్నారు మరి పార్ధసారధికి సీటు ఇవ్వకుండా ఎవరికి ఇస్తున్నారు అన్న ప్రశ్న వచ్చినపుడు వల్లభనేని వంశీ అని జవాబు వస్తోంది. ఆ విధంగా గట్టిగా ప్రచారం అయితే సాగుతోంది.
వల్లభనేని వంశీ టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ అయ్యారు. ఆయన గన్నవరం నుంచి 2014, 2019లలో రెండు సార్లు గెలిచారు. జగన్ వేవ్ లో సైతం ఆయన గెలిచారు. అలాంటిది ఆయనకు ఇపుడు షిఫ్టింగ్ అని అంటున్నారు. 2024లో కూడా అదే సీటు నుంచి పోటీ చేసి హ్యాట్రిక్ విక్టరీ కొట్టాలని వంశీ ఆలోచిస్తున్నారు.
కానీ అలా కాదు పెనమలూరు నుంచి పోటీ చేయమని అధినాయకత్వం కోరుతోందని టాక్ వినిపిస్తోంది. దానికి ఆయన ససేమిరా అంటున్నారని కూడా ప్రచారం సాగుతోంది. నిజానికి వంశీ బలం అంతా గన్నవరంలోనే ఉంది. మరి ఆయనను వేరే చోట నుంచి పోటీ చేయమని కోరడంలో ఆంతర్యం ఏమిటి అన్నది హై కమాండ్ కే తెలియాలి అని అంటున్నారు. ఇక వంశీ కూడా ఎటూ చెప్పలేని స్థితిలో ఉన్నారని అంటున్నారు.
పెనమలూరు బీసీలకు కేటాయించిన సీటు. ఇక్కడ మళ్లీ బీసీలకు ఇస్తేనే బాగుంటుంది అని అంటున్నారు. అలాంటిది సీనియర్ నేత బీసీ అయిన పార్ధసారధి నుంచి సీటు తీసుకుని ఓసీ అయిన వంశీకి ఇస్తే సామాజిక సమీకరణలు సరిపోతాయా అన్నది కూడా చర్చకు వస్తోంది. మొత్తానికి ఒకరేమో తన సీటో అని ఆవేదన చెందుతున్నారు. మరొకరేమో ఆ సీటు వద్దు అంటున్నారు.
కానీ హై కమాండ్ ఈ మార్పుచేర్పులను చేస్తోంది అని ప్రచారం సాగుతోంది. ఇందులోని అర్ధాలు పరమార్ధాలు ఏంటో తెలియడంలేదు అని అంటున్నారు. చూడాలి మరి అసలు విషయాలు లోతుగా ఎన్ని ఉన్నాయో ఏమో.