Begin typing your search above and press return to search.

వంశీ పొలిటికల్ లైఫ్ ని తేల్చేస్తున్న గన్నవరం !

వైసీపీలో చేరడం వల్ల అధికార పార్టీగా ఆయన భావించవచ్చు. కానీ ఆయన అనుకున్న పనులు ఏవీ అయిదేళ్లలో చేయలేకపోయారు.

By:  Tupaki Desk   |   11 May 2024 3:41 AM GMT
వంశీ పొలిటికల్ లైఫ్ ని తేల్చేస్తున్న గన్నవరం !
X

ఉమ్మడి కృష్ణా జిల్లాలో గన్నవరం ఇపుడు హాట్ టాపిక్ గా ఉంది. ఎందుకు అంటే డైనమిక్ లీడర్ వల్లభనేని వంశీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి. వల్లభనేని వంశీది రెండు దశాబ్దాల రాజకీయ జీవితం ఆయన 2009లో విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేసి లగడపాటి రాజగోపాల్ చేతిలో ఓటమి పాలు అయ్యారు. అలా ఆయన వెలుగులోకి వచ్చారు.

ఇక 2014లో టీడీపీ నుంచి గన్నవరం టికెట్ ని సాధించి గెలిచారు. 2019లో కూడా ఆయన అదే నియోజకవర్గం నుంచి గెలిచి హిస్టరీ క్రియేట్ చేశారు. ఎందుకు అంటే జగన్ వేవ్ బలంగా ఉన్న నేపధ్యంలో టీడీపీ నుంచి గెలిచిన 23 మందిలో వంశీ ఒకరు. అలాంటి వంశీ వైసీపీలోకి మారడంతో ఆయన రాజకీయ జాతకం కూడా మారిపోయింది.

వైసీపీలో చేరడం వల్ల అధికార పార్టీగా ఆయన భావించవచ్చు. కానీ ఆయన అనుకున్న పనులు ఏవీ అయిదేళ్లలో చేయలేకపోయారు. పైగా ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబం మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడి చేసిన వ్యక్తిగత విమర్శలు కూడా ఆయన పొలిటికల్ కెరీర్ మీద ఇపుడు ప్రభావం చూపిస్తున్నాయి.

ఇక వంశీ వైసీపీలోకి చేరినా అక్కడ వర్గ పోరుతో ఆయనకు ఇబ్బంది ఎదురైంది. ఆయన మీద పోటీ చేసి ఓడిన యార్లగడ్డ వెంకటరావు టీడీపీలో చేరి ఇపుడు ప్రత్యర్థిగా మారిపోయారు. ఇక వైసీపీలోనే ఉన్న మరో నేత వంశీ మీద పోటీ చేసి ఓడిన దుట్టా రామచంద్రరావు వర్గం సైతం వంశీకి పెద్దగా సహకరించడం లేదు.

దాంతో వంశీకి స్వపక్షంలో సహకారం పెద్దగా దక్కగా బలమైన విపక్షం నుంచి పోటీ ఎదురవుతున్న వేళ సానుభూతి అస్త్రాన్ని నమ్ముకున్నారు. తనకు ఇవే చివరి ఎన్నికలు అని ఆయన జనం వద్దకు వెళ్తున్నారు. ఈసారితో రాజకీయాలు వదిలేస్తాను అని గెలిపించాలని కోరుతున్నారు.

అయితే ఆయన బాబు కుటుంబం మీద చేసిన కామెంట్స్ తో బలమైన కమ్మ సామాజిక వర్గం ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకతను పెంచుకుంది. అలాగే నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి మార్క్ లేకపోవడంతో మిగిలిన వర్గాలు కూడా దూరం అవుతున్నాయి. ఇక రాజకీయంగా చూసుకుంటే టీడీపీకి గన్నవరం కంచుకోట.

కాంగ్రెస్ ఇక్కడ చివరి సారిగా 1989లో గెలిచింది. ఆ తరువాత రెండు సార్లు ఇండిపెండెంట్లు గెలిచినా మొత్తం మీద అనేక సార్లు గెలిచింది మాత్రం టీడీపీనే. ఆ పార్టీకి గన్నవరం బలమైన స్థావరం అయితే వైసీపీ పెట్టాక ఎన్నడూ గెలవని సీటుగా ఇది ఉంది.

దాంతో ఈసారి వైసీపీ నుంచి పోటీ చేస్తున్న వంశీ తనతో పాటు పార్టీని గెలిపించాలని చూస్తున్నారు. కానీ రాజకీయ సమీకరణలు అనుకూలంగా లేవు అని అంటున్నారు. ఈసారి కనుక వంశీ ఒటమి పాలు అయితే ఆయన చెప్పినట్లుగానే ఇవే చివరి ఎన్నికలు అవుతాయని అంటున్నారు. మొత్తం మీద వంశీ తాను ఎవరినీ ఏమీ అనలేదని తన మాటలు వక్రీకరించారని చెబుతున్నారు. గతంలో తాను చేసిన అభివృద్ధిని చూడమంటున్నారు. మరి జనాలు కరుణిస్తారా అంటే వెయిట్ అండ్ సీ.