వనమా వైపే కేసీఆర్.. మరి జలగం పరిస్థితి?
తాజాగా వనమాను ఇంటికి పిలిపించుకుని మరీ కేసీఆర్ చర్చించడమే ఇందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి
By: Tupaki Desk | 10 Aug 2023 1:30 PM GMTహైకోర్టులో కేసు గెలిచి.. తానే ఎమ్మెల్యేనని గుర్తించాలంటూ అసెంబ్లీ స్పీకర్‌కు విజ్ఞప్తి కూడా చేసి.. చివరకు సుప్రీం కోర్టు స్టేతో సైలెంట్ అయిన జలగం వెంగట్ రావు వచ్చే ఎన్నికల్లోనూ నిరాశ తప్పేలా లేదు. ఎందుకంటే ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొత్తగూడెం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకే మరోసారి టికెట్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆసక్తి చూపిస్తున్నారని తెలిసింది.
తాజాగా వనమాను ఇంటికి పిలిపించుకుని మరీ కేసీఆర్ చర్చించడమే ఇందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వివాదాలను మరిచి, ఎన్నికల కోసం క్యాడర్‌ను సిద్దం చేసుకోవాలని వనమాకు కేసీఆర్ సూచించినట్లు తెలిసింది. దీంతో మరోసారి టికెట్‌ను వనమాకే ఇవ్వాలనేది కేసీఆర్ ఉద్దేశంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే జరిగితే మరి జలగం పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్న.
2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కొత్తగూడెంలో పోటీ చేసిన జలగం వెంగట్రావు.. అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి వనమా చేతిలో ఓడిపోయారు. కానీ ఆ తర్వాత వనమా బీఆర్ఎస్‌లో చేరడం.. అఫిడవిట్లో తప్పుడు వివరాలు సమర్పించారని, వనమా ఎన్నిక చెల్లదంటూ జలగం కోర్టును ఆశ్రయించడం చకచకా జరిగిపోయాయి. వనమా ఎన్నిక చెల్లదని 2018 నుంచి జలగమే కొత్తగూడెం ఎమ్మెల్యే అంటూ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. దీంతో తనను ఎమ్మెల్యేగా గుర్తించాలంటూ జలగం స్పీకర్‌ను కోరారు.
మరోవైపు హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించడంతో వనమా ఊరట పొందారు. సుప్రీంలో ఈ కేసు తేలాలంటే ఒకట్రెండు నెలలైనా పడుతుంది. ఆలోపు ఎన్నికలు వచ్చేస్తాయి. దీంతో ఎమ్మెల్యేగానే ఎన్నికల బరిలో దిగి మరోసారి గెలవొచ్చనేది వనమా ప్రణాళికగా కనిపిస్తోంది. ఇప్పుడు కేసీఆర్ కూడా వనమాకే సపోర్ట్ ఇవ్వడంతో జలగం బీఆర్ఎస్‌లోనే ఉంటారా? లేదా పార్టీ మరి వనమాపై పోటీ చేస్తారా? అన్నది చూడాలి.