ఏపీ అల్లుడి తాజా వ్యాఖ్యలు.. ట్రంప్ కు సరైనోడే
ఇలాంటి వేళలోనే.. ట్రంప్ నోటి దూకుడుకు ఏ మాత్రం తగ్గని రీతిలో అతగాడు చేసిన వ్యాఖ్యలు విన్నోళ్లు ఉలిక్కిపడుతున్నారు.
By: Tupaki Desk | 18 July 2024 4:52 AM GMTమూడు రోజుల వరకు భారతీయుల్లో ఎవరికీ అతడి గురించి తెలీదు. ఎప్పుడైతే అతడ్ని రిపబ్లికన్ల ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించారో.. ఆ వెంటనే ఏపీ అల్లుడిగా యావత్ దేశం గుర్తు పెట్టేసుకుంది. అప్పటి నుంచి అతడి గురించి తెలుసుకునేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి వ్యక్తమవుతోంది. ఇలాంటి వేళలోనే.. ట్రంప్ నోటి దూకుడుకు ఏ మాత్రం తగ్గని రీతిలో అతగాడు చేసిన వ్యాఖ్యలు విన్నోళ్లు ఉలిక్కిపడుతున్నారు. ట్రంప్ నకు సరైనోడే దొరికాడన్న కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
రిపబ్లికన్ల ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించిన వాన్స్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా అందరి కనుబొమ్మలు ఎగురవేసేలా మారాయి. దీనికి కారణం ఆయన యూకేను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే. ‘‘లేబర్ పార్టీలోని యూకే అణ్వాయుధాలు కలిగిన తొలి ఇస్లామిక్ దేశంగా మారే అవకాశాలు ఉన్నాయి’’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. యూకే కన్జర్వేటివ్ నేతల సదస్సులో పాల్గొన్న వాన్స్ మాట్లాడుతూ.. ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద ముప్పుల్లో అణ్వాయుధాల విస్తరణగా పేర్కొన్న వాన్స్.. ‘‘బైడెన్ ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం చేస్తోంది. ప్రపంచంలోనే అణ్వాయుధాలు కలిగిన తొలి దేశం ఏది అవుతుంది? అన్న ప్రశ్న వస్తే ముందుగా మేం ఇరాన్.. పాకిస్థాన్ అవుతాయేమో అనుకున్నాం. కానీ.. చివరకు యునైటెడ్ కింగ్ డమ్ అని నిర్ణయించుకున్నాం. ఎందుకుంటే అక్కడ లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది’’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. వాన్స్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అతడిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ వ్యాఖ్యలపై యూకే ఉప ప్రధాని ఏంజెలా రేనెర్ స్పందిస్తూ... వాన్స్ వ్యాఖ్యల్ని ఖండించటమే కాదు.. గతంలోనూ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు పలుమార్లు చేశారన్నారు. వాన్స్ అభిప్రాయాల్ని పెద్దగా పట్టించుకోమన్న ఏంజెలా.. ‘‘మా అంతర్జాతీయ మిత్ర దేశాలతో కలిసి పని చేయాలనుకుంటున్నాం. మేం బ్రిటన్ ప్రజల తరఫున పాలన అందిస్తాం’’ అని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. వాన్స్ ఇచ్చిన తొలి ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. చైనాపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. యూఎస్ కు డ్రాగన్ దేశం అతి పెద్ద ముప్పుగా అభివర్ణించారు. చివర్లో వాన్స్ గురించి ఒక మాట చెప్పాలి. అప్పటివరకు విమర్శలు గుప్పించిన వారికి విధేయుడిగా వ్యవహరించే తత్త్వం వాన్స్ సొంతమని చెప్పాలి. ఈ వాదనకు తగ్గట్లే.. గతంలో ట్రంప్ మీద తీవ్ర విమర్శలు చేసిన వాన్స్.. ఈ రోజున ఆయనకు విధేయుడిగా మారారు.
అంందరి అంచనాలకు భిన్నంగా ట్రంప్ అధ్యక్షుడిగా బరిలోకి దిగితే. ఇప్పుడు ఉపాధ్యక్షుడిగా ఎంపిక కావటం చూస్తే.. వాన్స్ టాలెంట్ ఏమిటో ఇట్టే అర్థమవుతుంది. మొత్తంగా ట్రంప్ మాటలతో నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య ఖాయమన్న వేళలో.. ఆయనకు మించి అన్నట్లుగా వాన్స్ తాజా వ్యాఖ్యల మాటలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ తరహా వ్యాఖ్యలు మరెన్ని ఆయన నోటి నుంచి వస్తాయో చూడాలి.