Begin typing your search above and press return to search.

రైల్వే జోన్... డేట్ టైం ఫిక్స్ అయినట్లేనా ?

యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం టైంలో కొత్త జోన్లు ప్రకటించినా విశాఖకు ఆ లక్ చిక్కలేదు.

By:  Tupaki Desk   |   16 Sep 2024 4:39 PM GMT
రైల్వే జోన్... డేట్ టైం ఫిక్స్ అయినట్లేనా ?
X

విశాఖకు రైల్వే జోన్ అన్నది ఈ రోజుది కాదు, ఈనాటిది కాదు అర్ధ శతాబ్దం పైగా చరిత్ర ఉంది. ఇప్పటికి 55 ఏళ్ల క్రితం విశాఖకు రైల్వే జోన్ కావాలని ఆనాటి విశాఖ లోక్ సభ సభ్యుడు తెన్నేటి విశ్వనాథం పార్లమెంట్ లో గళమెత్తారు. అలా ఆనాటి నుంచి కేవలం డిమాండ్ గానే ఉంది. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం టైంలో కొత్త జోన్లు ప్రకటించినా విశాఖకు ఆ లక్ చిక్కలేదు.

అదే విధంగా వాజ్ పేయ్ ప్రధానిగా ఉన్న సమయంలోనూ మరి కొన్ని రైల్వే జోన్లను ఇచ్చారు. అయినా కూడా విశాఖ పేరు ప్రస్తావనకు లేదు, విభజన హామీలలో చివరికి చోటు దక్కింది. ఏపీ రెండుగా మారి దశాబ్దం పై దాటింది కానీ ఇంకా రైల్వే జోన్ కూతను మాత్రం విశాఖ వాసులు వినలేదు.

విశాఖ రైల్వే జోన్ ఇచ్చేశామని 2019 ఎన్నికల ముందు కేంద్రం ప్రకటించింది. కానీ అయిదేళ్లలో అడుగు ముందు పడలేదు. దానికి వైసీపీ ప్రభుత్వం భూమి చూపించలేదని కేంద్రం పేర్కొంది. మేము భూమి ఇచ్చామని వైసీపీ చెప్పింది. మరి ఎక్కడ గ్యాప్ ఉందో తెలియదు కానీ అలా ఆ ప్రాజెక్ట్ అయితే నిలిచి పోయింది.

ఇపుడు చూస్తే ఏపీలో కేంద్రంలో ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది. దాంతో బీజేపీ రైల్వే జోన్ చిటికలో ఇవ్వగలదు, ఏపీ సీఎం చంద్రబాబు కూడా అడిగి తెచ్చుకోగలరు. కానీ లేట్ మాత్రం అలాగే కొనసాగుతోంది. దీని మీద అయితే ప్రకటనల మీద ప్రకటనలు వెలువడుతూనే ఉన్నాయి. విశాఖ రైల్వే జోన్ అదిగో ఇదిగో అని కేంద్ర రైల్వే మంత్రి గడచిన మూడు నెలలలో తరచుగా ప్రకటిస్తూనే ఉన్నారు.

తాజాగా విశాఖకు మరో వందే భారత్ రైలు మంజూరు చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రైల్వే జోన్ మీద మళ్లీ ఊరించే ప్రకటన చేశారు. విశాఖ రైల్వేజోన్‌కు త్వరలోనే భూమిపూజ నిర్వహిస్తామని ఆయన చెప్పారు. దానికి ఒక ముహూర్తం కూడా ఆయన ప్రకటించారు.

ఈసారి దసరా పండుగ పూర్తి అయిన తరువాత ఒక శుభ ముహూర్తాన పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు. దీంతో పదేళ్ల ఎదురుచూపులకు దసరా తర్వాత అయినా మంచి వార్త వస్తుందా అన్నది విశాఖ వాసులతో పాటు ఉత్తరాంధ్ర వాసులు కూడా ఆలోచిస్తున్నారు. విశాఖకు రైల్వే జోన్ వస్తే తెన్నేటి వారి కల సాకారం అవుతుందని కూడా అంటున్నారు

ఇక విశాఖపట్నం రైల్వే జోన్‌కు సంబంధించి రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. రైల్వే జోన్ కార్యాలయం కోసం టీడీపీ కూటమి విశాఖలో ఇప్పటికే 52 ఎకరాలను కేటాయించిన నేపథ్యంలో ఇక కేంద్రానిదే ఆలస్యం అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఈ సువిశాలమైన ప్రాంతంలోనే రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయనున్నారని అంటున్నారు. ఏది ఏమైనా రైల్వే జోన్ కనుక వైస్తే విశాఖ రూపురేఖలు ఎంతో కొంత మారుతాయన్నది అన్ని వర్గాల భావనగా ఉంది.