పట్టాలెక్కేందుకు వందే భారత్ స్లీపర్ కు మరో 3 నెలలు
మోస్ట్ అవైటింగ్ గా మారిన వందే భారత్ స్లీపర్ ట్రైన్ల మీద ఉన్న హైప్ అంతా ఇంతా కాదు.
By: Tupaki Desk | 1 Sep 2024 5:30 PM GMTమోస్ట్ అవైటింగ్ గా మారిన వందే భారత్ స్లీపర్ ట్రైన్ల మీద ఉన్న హైప్ అంతా ఇంతా కాదు. ఇప్పటి వరకు సాదాసీదా ప్రయాణికుడ్ని కొత్త తరహా ప్రయాణ అనుభూతిని కలిగించేలా వందే భారత్ స్లీపర్ ట్రైన్లను డిజైన్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా విడుదల చేసిన ఫోటోలు అలాంటి భావనకు గురి చేస్తున్న పరిస్థితి. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ట్రైన్లను పట్టాలెక్కిస్తారన్న ప్రచారం జోరుగా సాగింది.
చూస్తుండగానే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రావటం.. సుదీర్ఘంగా సాగటం.. ఫలితాలు వెల్లడి కావటం.. మోడీ సర్కారు మూడోసారి అధికారంలోకి రావటం జరిగింది. ఇలా జరిగి కూడా మూడు నెలలు దాటేసింది. అయినా.. వందే భారత్ స్లీపర్ రైళ్ల జాడ లేని పరిస్థితి. ఇలాంటి వేళ.. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వందే భారత్ స్లీపర్ కోచ్ ప్రోటోటైప్ వెర్షన్ రైళ్లను ఆవిష్కరించటంతో మరోసారి ఈ రైళ్ల చర్చ మొదలైంది. బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో వీటిని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు ముఖ్యమైన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం. వందే భారత్ ఛైర్ కార్ విజయవంతమైన తర్వాత.. వందేభారత్ స్లీపర్ కోసం చాలా శ్రమించాం’’ అని పేర్కొన్నారు. స్లీపర్ బోగీల తయారీ ఇప్పుడే పూర్తైందని.. పది రోజుల పాటు వీటిపై కఠిన ట్రయల్స్.. పరీక్షలు నిర్వహిస్తామని.. వచ్చే రెండు..మూడు నెలల్లో పట్టాలెక్కనున్నట్లు పేర్కొన్నారు. ‘‘ప్రయాణికులకు సేవలు అందించేందుకు త్వరలో వందే భారత్ స్లీపర్ ట్రైన్లు వచ్చేస్తున్నాయి’’ అని వెల్లడించారు.
ముందుగా చెప్పినట్లే వందే భారత్ రైళ్లు మూడు వెర్షన్లలో వస్తున్నాయి. ఇప్పటికే సెమీ హైస్పీడ్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఛైర్ కార్ రైళ్లు దేశ వ్యాప్తంగా పలు నగరాల మధ్య తమ సేవల్ని అందించటం తెలిసిందే. త్వరలో స్లీపర్ వందే భారత్ రైళ్లు తమ సేవల్ని షురూ చేయనున్నాయి. దీని తర్వాత త్వరలో వందే మెట్రో రైళ్లను కూడా తీసుకురానున్నాయి. స్లీపర్ రైళ్లలో ఉండే వసతులు హైటెక్ తరహాలో ఉంటాయని చెబుతున్నారు.
వందే భారత్ స్లీపర్ రైళ్లు 16 కోచ్ లు.. 823 బెర్తులతో ఉండనున్నాయి. వీటిల్లో 11 కోచ్ లు త్రీ టైర్ కాగా.. నాలుగు టూ టైర్ ఏసీ కోచ్లు.. ఒకటి ఫస్ట్ టైర్ ఏసీ కోచ్ ఉండనుంది. త్రీ టైర్ ఏసీ బోగీల్లో మొత్తం 600 సీట్లు.. టూ టైర్ ఏసీ కోచ్ లలో 188 బెర్తులు ఉండనున్నాయి. ఆటోమేటిక్ డోర్లు.. మెరుగైన సదుపాయాలతో పాటు బాత్రూంలు కొత్త టెక్నాలజీతో రూపొందించారు. అన్ని కోచ్ లు స్టెయిన్ లెస్ స్టీల్ కార్ బాడీతో ఉంటాయి. రైల్వే ప్రమాదాలకు అడ్డుకట్ట వేసే కవచ్ వ్యవస్థ ఉండనుంది. స్లీపర్ కోచ్ లో రీడింగ్ ల్యాంప్స్.. ఛార్జింగ్ అవుట్ లెట్ లు.. స్నాక్ టేబుల్.. మొబైల్/మ్యాగజైన్ హాల్డర్స్ ఉంటాయని చెబుతున్నారు. వీటికి తోడు ఇంపైన ఇంటీరియర్ తో ఆకర్షణీయంగా సిద్ధం చేశారు. ఈ ట్రైన్ ను చూసినంతనే ఎప్పుడెప్పుడు ఇందులో ప్రయాణిద్దామా? అన్న భావన రాక మానదు. కాకుంటే.. ఈ ట్రైన్ టికెట్ మిగిలిన ట్రైన్ల టికెట్లతో పోలిస్తే ఎక్కువగా ఉండే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.