వైరల్: మనసు దోచేసిన వందే భారత్ స్లీపర్ ట్రైన్ వీడియో
అలాంటి వేళలో తాజాగా కేంద్ర రైల్వే మంత్రి ఆశ్విని వైష్ణవ్.. వందే భారత్ స్లీపర్ ట్రైన్ కు సంబంధించిన ఆసక్తికర వీడియోను పోస్టు చేశారు.
By: Tupaki Desk | 4 Jan 2025 5:55 AM GMTఊరించేస్తోంది వందే భారత్ స్లీపర్ ట్రైన్. వందే భారత్ సిట్టింగ్ ట్రైన్ కు మించిన ఫీచర్లతో.. ఎప్పుడు వచ్చేస్తావ్ బ్రో.. వెయిట్ చేయలేమన్నట్లుగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. షెడ్యూల్ ప్రకారం చూస్తే.. సార్వత్రిక ఎన్నికలకు ముందు పట్టాలు ఎక్కేస్తుందని భావించిన వందే భారత్ స్లీపర్ ట్రైన్.. అదేమీ సాధ్యం కాలేదు. ప్రభుత్వం కొలువు తీరి దాదాపు ఆర్నెల్లు దాటిన తర్వాత కూడా ఎప్పుడు వస్తుందో అర్థం కాని పరిస్థితి.
అలాంటి వేళలో తాజాగా కేంద్ర రైల్వే మంత్రి ఆశ్విని వైష్ణవ్.. వందే భారత్ స్లీపర్ ట్రైన్ కు సంబంధించిన ఆసక్తికర వీడియోను పోస్టు చేశారు. ఇందులో గంటకు 180కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లే వందే భారత్ ట్రైన్ మాత్రమే కాదు.. అంత వేగంలోనూ గ్లాస్ నిండుగా వాటర్ పోసి ఉంచినప్పటికి.. సదరు గ్లాస్ కదలని రీతిలో ఉండటం ద్వారా.. ఈ రైలు అంత వేగంలోనూ ఎలాంటి కుదుపులకు లోను కాదన్న విషయాన్ని మాటలతో కాకుండా.. చేతలతో చూపించారని చెప్పాలి.
కేంద్ర మంత్రి పోస్టు చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది. వందే భారత్ స్లీపర్ ట్రైన్ కు పరీక్షలు నిర్వహించగా.. గరిష్ఠంగా గంటకు 180కిలో మీటర్లు దూసుకెళ్లేలా ఉండటం.. అందరి మదిని దోచేస్తోంది. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సూచనల మేరకు రాజస్థాన్ లోని కోటా రైల్వే డివిజన్ లో ఈ పరీక్షను నిర్వహించారు. వందే భారత్ స్లీపర్ ట్రైన్ ను తొలుత గంటకు 130 కి.మీ. వేగంతో నడిపారు. ఆ తర్వాత గంటకు 140, 150, 160కు పెంచారు. తాజాగా ఈ వేగాన్ని 180కి.మీ. తీసుకెళ్లారు. పరీక్షల సమయంలో సాధారణ ప్రయాణికులు ఉంటే ట్రైన్ ఎంత బరువు ఉంటుందో.. అంతే బరువును ట్రైన్ లో ఉంచి పరీక్షలు జరిపారు.
ఈ ట్రైన్ ను విభిన్నమైన ట్రాక్ లలో పరీక్షిస్తున్నారు. ఏ ట్రాక్ లో గరిష్ఠంగా ఎంత వేగంగా ఈ ట్రైన్ దూసుకెళుతుందన్న విషయాన్ని పరీక్షిస్తున్నారు. రైల్వే వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం..వందే భారత్ స్లీపర్ ను ఫిబ్రవరి నుంచి పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్లీపర్ ట్రైన్ లో మొత్తం 16 బోగీలు ఉంటాయని.. అందులో 10 బోగీలు థర్డ్ ఏసీకి.. నాలుగు సెకండ్ ఏసీకి.. ఒక బోగీ ఫస్ట్ ఏసీకి కేటాయిస్తారు.
నాన్ ఏసీ బోగీ ఇందులో లేనట్లే. కాకుంటే.. ఈ స్లీపర్ ట్రైన్ లో సీటింగ్ తో పాటు.. లగేజ్ కోసం రెండు బోగీలు ఉండనున్నాయి. తొలుత పరిమిత రూట్లలో ఈ ట్రైన్ ను అందుబాటులోకి తీసుకొచ్చి.. దశల వారీగా వీటి సంఖ్యను పెంచనున్నారు. చివరగా.. ధరల విషయానికి వస్తే.. వందే భారత్ సిట్టింగ్ ట్రైన్ లో మాదిరే.. ఈ హై స్పీడ్ రైళ్లలో టికెట్ ధరలు సాధారణ ట్రైన్ల కంటే ఎక్కువగా ఉండటం ఖాయమని చెబుతున్నారు. ఇప్పటివరకు వీటి టికెట్ ధరలు ఎంత ఉంటాయన్న సమాచారాన్ని రైల్వే శాఖ విడుదల చేయలేదు.