Begin typing your search above and press return to search.

వందే భారత్‌ రైలుకు తప్పిన ముప్పు... పక్కా ప్లాన్?

సమయంలో రైలు రాజస్థాన్ రాష్ట్రంలోని భిల్వాడా రైల్వే స్టేషన్ సమీపంలో రాగానే రైల్వే ట్రాక్‌ పై రాళ్లు, ఇనుప రాడ్లు పేర్చి ఉన్నాయి.

By:  Tupaki Desk   |   3 Oct 2023 3:59 AM GMT
వందే భారత్‌  రైలుకు తప్పిన ముప్పు... పక్కా ప్లాన్?
X

ఈ ఏడాది అత్యంత ఘోరమైన ఒడిశా రైలు ప్రమాదం అనంతరం అనంతరం మరికొన్ని చెదురుమదురు సంఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. మరికొన్ని చోట్ల బోగీల్లో అకస్మాత్తుగా మంటలు వచ్చిన ఘటనలు జరిగాయి. అయితే అవి ప్రమాధాలు, అధికారుల నిర్లక్ష్యానికి దక్కిన ఫలాలు! ఇప్పుడు చెప్పుకోబోయేది దుండగుల దుశ్చర్యల్లో భాగాలు!

అవును... కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి తీసుకొచ్చిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లపై మొదట్నుంచి రాళ్ల దాడులు జరుగుతున్న సంగతి తెలిసింది. ఇందులో భాగంగా తాజాగా ఓ వందేభారత్ రైలుకు పెను ప్రమాదాన్ని తలబెట్టారు దుండగులు! ఇందులో భాగంగా... రైలు పట్టాలపై రాళ్లు, ఇనుప రాడ్లను పేర్చారు. ఈ విషయాన్ని గుర్తించిన లోకో పైలట్లు ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో వందల మంది ప్రయాణికులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... సోమవారం ఉదయం 7:50 గంటలకు ఉదయ్‌ పూర్ నుంచి జైపూర్‌ కు వందేభారత్ రైలు బయల్దేరింది. ఉదయం గం. 9:55 ని. సమయంలో రైలు రాజస్థాన్ రాష్ట్రంలోని భిల్వాడా రైల్వే స్టేషన్ సమీపంలో రాగానే రైల్వే ట్రాక్‌ పై రాళ్లు, ఇనుప రాడ్లు పేర్చి ఉన్నాయి. ఇది గమనించిన లోకో పైలట్లు వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును నిలిపివేశారు.

దీంతో పెను ప్రమాధమే తప్పిందనే మాటలు వినిపిస్తున్నాయి. ఆ సమయంలో రైలు ఆగిన అనంతరం దిగి పట్టాలను పరీక్షిస్తే షాకింగ్ విషయం బయట పడింది. పట్టాలపై రాళ్లతోపాటు, అవి కదలకుండా ఇనుపరాడ్లు పెట్టినట్లు గుర్తించారు. దీంతో ఇది పక్కా ప్లాన్ అని గ్రహించిన పైలైట్ వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించారు.

దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇది ఎవరైనా ఆకతాయిలు చేసిన పనా.. లేక, దీని వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ గా మారింది.

కాగా... వందే భారత్ రైళ్లు మొదలైన నాటి నుంచి వాటిపై కొందరు దుండగులు రాళ్ల దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ట్రాక్ పై పక్కాగా రాళ్లు, అవి జారిపోకుండా వాటిని ఇనుప రాడ్లతో అమర్చిన వ్యవహారం చూస్తుంటే... ఇదేదో పక్కా ప్లానింగ్ తో చేసినట్లుగా అనిపిస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.