Begin typing your search above and press return to search.

సికింద్రాబాద్ - ముంబయి.. వందేభారత్ స్లీపర్ ట్రైన్ రూటుపై క్లారిటీ?

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ ట్రైన్ పంద్రాగస్టు నాడు పట్టాలెక్కుతుందన్న వార్త బలంగా వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   12 July 2024 5:34 AM GMT
సికింద్రాబాద్ - ముంబయి.. వందేభారత్ స్లీపర్ ట్రైన్ రూటుపై క్లారిటీ?
X

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ ట్రైన్ పంద్రాగస్టు నాడు పట్టాలెక్కుతుందన్న వార్త బలంగా వినిపిస్తోంది. రైల్వే అధికారులు అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. వందే భారత్ స్లీపర్ వెర్షన్ బయటకు రావటం ఖాయమని చెబుతున్నారు.మోడీ సర్కారు ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాంలలో వందే భారత్ స్లీపర్ ట్రైన్ ఒకటన్న సంగతి తెలిసిందే. వందేభారత్ స్లీపర్ ట్రైన్ కు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో పట్టాలెక్కే రైలు రూటుపై తాజాగా క్లారిటీ వచ్చినట్లేనని చెప్పాలి.

తొలి స్లీపర్ ట్రైన్ సికింద్రాబాద్ - ముంబయి రూట్ లో పరుగులు తీస్తుందని చెబుతున్నారు. రెండు మహానగరాల మధ్య పరుగులు తీసేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ నగరాల మధ్య వందే భారత్ రైళ్లు ఏవీ ప్రయాణించని కారణంగా.. ఈ రద్దీ రూట్ లో నడిపితే బాగుంటుందన్న ఆలోచనలో అధికారులు ఉన్నట్లు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ రూట్ లో వందే భారత్ స్లీపర్ ట్రైన్ ను నడిపేలా ప్లాన్ చేయాలంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ కు సూచన చేయటంతో.. ఈ రూట్ లోనే తొలి రైలు పట్టాలెక్కుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా మరో వందేభారత్ కూడా అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. ఇప్పటివరకు సికింద్రాబాద్ -ఫుణెల మధ్య నడుస్తున్న శతాబ్ధి ఎక్స్ ప్రెస్ స్థానంలో వందేభారత్ సిట్టింగ్ ట్రైన్ ను నడుపుతారని చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో సూపర్ సక్సెస్ అయిన కాచిగూడ - బెంగళూరు వందే భారత్ ను ఇప్పటివరకు ఎనిమిది బోగీల్లో నడుపుతున్నారు. ఈ ఎనిమిది బోగీలు వంద శాతం నిండిపోవటం.. డిమాండ్ అధికంగా ఉన్న నేపథ్యంలో ఎనిమిది కోచ్ లకు బదులుగా పదహారు కోచ్ లతో నడిపేందుకు వీలుగా ప్లాన్ చేస్తున్నారు. మొత్తంగా రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ స్లీపర్ ట్రైన్లు పెద్ద ఎత్తున పరుగులు తీయటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.