Begin typing your search above and press return to search.

రిజల్ట్ రాకుండానే వంగా గీత టోన్ లో మార్పు...!?

నాగబాబు సహా మెగా ఫ్యామిలీ మీద తాను ఎన్నికల ప్రచారంలో ఒక్క విమర్శ కూడా చేయలేదని ఆమె అన్నారు.

By:  Tupaki Desk   |   20 May 2024 5:35 PM GMT
రిజల్ట్ రాకుండానే వంగా గీత టోన్ లో మార్పు...!?
X

పిఠాపురం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన వంగా గీత టోన్ మార్చారా అన్న చర్చ సాగుతోంది. ఆమె ఇటీవల ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఇపుడు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. ఈ ఇంటర్వ్యూలో ఆమె ఏమన్నారు అన్నది చూస్తే కనుక మెగా ఫ్యామిలీ పట్ల ఆమెకు ఉన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మెగాస్టార్ చిరంజీవిని తాను ఎప్పటికీ అన్నయ గారు గానే భావిస్తాను అని ఆమె అన్నారు.

నాగబాబు సహా మెగా ఫ్యామిలీ మీద తాను ఎన్నికల ప్రచారంలో ఒక్క విమర్శ కూడా చేయలేదని ఆమె అన్నారు. అంతే కాదు తాను పవన్ కళ్యాణ్ ని ఒక్క మాట అనలేదని, తన పక్కన ఉన్న వారు అనమన్నా కూడా తాను వారించానని వారికీ వద్దని చెప్పాను అని అన్నారు. ఇపుడే కాదు ఇక ముందు కూడా తాను మెగా ఫ్యామిలీ మీద కానీ పవన్ మీద కానీ ఎలాంటి ఆరోపణలు చేయను అని ఆమె అనడం విశేషం.

దీంతో ఇపుడు వైసీపీ శిబిరంలో అనుమానాలు మొదలయ్యాయని అంటున్నారు. నిజానికి చూస్తే వంగా గీత ప్రస్థానం టీడీపీలో మొదలైంది. ఆ పార్టీ ద్వారానే ఆమె ఉన్నత పదవులు అందుకున్నారు. ఆమె జిల్లా పరిషత్ చైర్ పర్సన్ చేశారు. రాజ్యసభ మెంబర్ గా చేశారు. 2009లో ప్రజారాజ్యం నుంచి పిఠాపురానికి ఆమె ఎమ్మెల్యేగా నెగ్గారు.

ఇక ఆ పార్టీ కాంగ్రెస్ లో కలిస్తే ఆమె కూడా అందులో చేరారు అయితే ఆమె ఈ సందర్భంగా మంత్రి పదవిని ఆశించారు అని అంటారు. కానీ ప్రజారాజ్యం నుంచి ఇద్దరికే క్యాబినెట్ బెర్త్ అప్పట్లొ దక్కాయి. దాంతో ఆమెకు చాన్స్ లేకుండా పోయింది. దాంతో కొంత అసంతృప్తికి ఆనాడు ఆమె గురి అయ్యారు.

ఇక 2014లో ఆమె పోటీ చేయలేదు, 2019లో కూడా ఆమె మొదట జనసేననే ఎంచుకున్నారు అని కూడా ప్రచారం లో ఉన్న మాట. అప్పట్లో ఏమి జరిగిందో తెలియదు కానీ ఆమె వైసీపీలో లాస్ట్ మినిట్ లో చేరడం ఆ వెంటనే కాకినాడ లోక్ సభ సీటు ఆమెకు ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. జగన్ వేవ్ లో ఆమె బ్రహ్మాండంగా గెలిచేశారు కూడా.

ఇక ఈసారి ఆమె పిఠాపురం మీదనే కన్నేసి రెండేళ్ళుగా అక్కడే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ వచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి పోటీ చేస్తారు అని ఆమె అనుకోలేదని ఆయన రావడంతో పోటీ టఫ్ గా మారింది ఇపుడు విజయం ఎవరిని వరిస్తుందో తెలియదు అని అంటున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే మెగా ఫ్యామిలీని ఫ్యూచర్ లో కూడా విమర్శించను అని వంగా గీత అంటున్నారు అంటే వైసీపీ అధినాయకత్వానికి ఇది ఆలోచినుకునేలాగే ఉంది అని అంటున్నారు. ఇక పిఠాపురం నుంచి పోటీ చేయడానికి సిద్ధమైన తరువాత అక్కడికి వచ్చిన పవన్ మాట్లాడుతూ వంగా గీతను జనసేనలో చేరమని ఆహ్వానించారు. ఇపుడు ఆమె మాటలు చూస్తూంటే ఫ్యూచర్ లో వైసీపీ కనుక ఓటమి పాలు అయితే ఆ పార్టీలోకే వెళ్తారా అన్న డౌట్లు అయితే అటూ ఇటూ వస్తున్నాయట.

మొత్తం మీద చూస్తే వంగా గీత ఓడినా ఆమెకు వైసీపీ అధికారంలోకి వస్తే ఉన్నత పదవి ఇవ్వాలని వైసీపీ ఆలోచిస్తున్నదని ప్రచారం సాగుతున్న నేపధ్యంలో ఆమె ఇలా మాట్లాడిన మాటలను ఇపుడు సర్క్యులేట్ చేయడం వెనక ఎవరు ఉన్నారు అన్న చర్చ కూడా సాగుతోంది. గీత వైసీపీలో ఉంటారా లేదా అన్నది పక్కన పెడితే రేపటి రోజున వైసీపీ అధికారంలోకి వస్తే మంత్రి పదవుల కోసం చూస్తున్న వారు మాత్రం గీత అడ్డు తొలగించుకోవడానికే ఇలా చేశారా అన్న చర్చ కూడా నడుస్తోంది.