జగన్ సెక్యూరిటీ నెల ఖర్చు లెక్క చెప్పిన హోంమంత్రి
తాజాగా ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్న వేళలో
By: Tupaki Desk | 22 Aug 2024 4:16 AM GMTఅధికారంలో ఉన్నప్పుడు జగన్ ప్రభుత్వం చేపట్టిన పనులు.. చేసిన ఖర్చుల గురించి విడతల వారీగా లెక్కలు చెప్పటం.. వాటికి సంబంధించిన వివరాల్ని విలేకరులకు సమావేశాలు పెట్టి మరీ వెల్లడించే పని చేపట్టింది చంద్రబాబు నాయకత్వంలోని కూటమి సర్కారు. తాజాగా ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్న వేళలో.. ఆయనకు సెక్యూరిటీగా 980 మంది పోలీసు సిబ్బందితో భారీ భద్రతను ఏర్పాటు చేసుకున్నట్లుగా పేర్కొన్నారు.
దీని కోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ.6 కోట్లు ఖర్చు చేసినట్లుగా చెప్పారు. వీరు సరిపోరన్నట్లుగా ప్రైవేటు వ్యక్తుల్ని సైతం భద్రత కోసం ఏర్పాటు చేసుకున్నారని.. వారికి ప్రభుత్వ ఖజానా నుంచి రూ.53 లక్షలు చొప్పున చెల్లించినట్లుగా పేర్కొన్నారు. తాజాగా విలేకరులతో మాట్లాడిన ఆమె.. ఎమ్మెల్యేగా ఉన్న జగన్ కు రూల్ ప్రకారం జడ్ ప్లస్ భద్రత.. ఆయన తల్లి విజయమ్మ.. భార్య భారతికి 2 ప్లస్ 2 సెక్యూరిటీ ఇస్తున్నట్లు తెలిపారు.
జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన తల్లి విజయమ్మకు 1 ప్లస్ 1 భద్రత మాత్రమే ఉండేదన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు కుటుంబ సభ్యులకు ఎలాంటి భద్రత లేదన్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి.. కోడలు బ్రాహ్మణికి ఎలాంటి సెక్యూరిటీ లేదన్న ఆమె.. రాష్ట్రంలో జరిగినట్లుగా ప్రచారం చేసిన 36 రాజకీయ హత్యలకు సంబంధించి వివరాలు వెల్లడించాలని జగన్ ను కోరితే.. ఇప్పటివరకు ఆయన ఎలాంటి సమాధానం చెప్పలేదని పేర్కొన్నారు. మొత్తంగా ముఖ్యమంత్రిగా ఉన్న వేళలో.. జగన్మోహన్ రెడ్డి సెక్యురిటీకి పెట్టిన భారీ ఖర్చు గురించి హోం మంత్రి అదే పనిగా మాట్లాడటం గమనార్హం.