వంగవీటిని బరిలోకి దించుతున్న బాబు ?
దాంతో గుంటూరు, విజయవాడ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల మీద కన్నేసింది.
By: Tupaki Desk | 3 Oct 2024 9:30 AM GMTఏపీలో రాజకీయం మళ్లీ రంజుగా సాగనుంది. వచ్చే ఏడాది మార్చిలో జరిగే పట్టభర్దుల ఎన్నికలను వేదికగా చేసుకుని అటు అధికార టీడీపీ కూటమి ఇటు విపక్ష వైసీపీ కూడా తమ రాజకీయ జాతకాలను పరీక్షించుకోవాలని చూస్తున్నాయి. వైసీపీ అయితే మొత్తంగా అంతా పోగొట్టుకుంది. అసలూ కొసరూ అన్నీ పోయి ఆశలు అడుగంటిన వేళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయినా శక్తిని కూడదీసుకుంటే పరువు దక్కుతుందని భావిస్తోంది.
దాంతో గుంటూరు, విజయవాడ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల మీద కన్నేసింది. ఇక బలమైన అభ్యర్ధినే చూసి మరీ బరిలోకి దించుతోంది అని ప్రచారం సాగుతోంది. జగన్ కి సన్నిహిత బంధువు అయిన గౌతం రెడ్డిని పోటీకి పెడితే అన్నీ ఆయనే చూసుకుంటారు ఆ పైన ఓటర్లలో పెరిగిన అసంతృప్తి ఉండనే ఉంది అని వైసీపీ లెక్క వేసుకుంటోంది.
ఇక టీడీపీ కూటమి నుంచి మాజీ మంత్రి ఆలపాటి రాజాని ఎంపిక చేశారు అని ఇప్పటిదాకా వినిపించిన మాట. ఆయన అయితే గౌతం రెడ్డితో పోటీ ఎంతో కొంత టఫ్ అవుతుందా అన్న ఆలోచనలో టీడీపీ కూటమి భావిస్తూ రెండవ ఆలోచన చేస్తోంది అని అంటున్నారు.
అదెలా అంటే వంగవీటి రాధాకృష్ణ అని ప్రచారం సాగుతోంది. వంగవీటి రాధాక్రిష్ణకు గౌతం రెడ్డికి ఇద్దరూ వైసీపీలో ఉన్నపుడు వివాదం ఉంది. ఈ ఇద్దరి వివాదం వల్లనే రాధా వైసీపీని వీడిపోయారు అని కూడా టాక్ ఉంది. ఇక వంగవీటిని దించడం వెనక ఇదే ప్రధాన కారణం అని అంటున్నారు.
పాత వివాదాన్ని రాజేస్తే ఆ ఊపులో సామాజిక రాజకీయ సమీకరణల్లో వంగవీటి రాధాకృష్ణ నెగ్గుకుని సులువుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుచుకుని వస్తారు అని టీడీపీ అంచనా వేస్తోంది. మరో వైపు చూస్తే రాధా అయితే జనసేన కూడా నూటికి నూరు శాతం సహకరిస్తుంది అని అంటున్నారు.
ఇక రాధా కనుక ఎమ్మెల్సీగా గెలిచి వస్తే ఆయన కోసం కేబినెట్ బెర్త్ ని కూడా రెడీ చేసి పెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. రాధాక్రిష్ణ ఘనమైన రాజకీయ చరిత్ర కలిగిన వారు. వంగవీటి రంగా వారసుడు. అయినా ఆయన జీవితంలో ఒకేసారి గెలిచారు. 2004 తరువాత ఆయనను గెలుపు పిలుపు వరించలేదు.
ఆయన వరసగా 2009లో ప్రజారాజ్యం నుంచి, 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. 2019లో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినా టికెట్ దక్కలేదు. 2024లోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. దాంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రాధా మాత్రం రాజకీయంగా ఏమీ కాకుండా మిగిలిపోయారు. అయితే రాధాను ఎమ్మెల్సీగా గెలిపించుకుని మంత్రిని చేయాలని చూస్తున్నారు అని అంటున్నారు.
ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో సామాజిక సమీకరణల నేపథ్యంలో రాధాకే మంత్రి పదవి ఖాయమని అప్పట్లో ప్రచారం సాగింది.మరి అది నెరవేరాలీ అంటే రాధాను ఎమ్మెల్సీగా నిలబెట్టాలి. గెలిపించుకోవాలి. మొత్తానికి రాధా అనుచరులు అభిమానులు ఆశిస్తున్నట్లుగా ఆయనకు టీడీపీ అధినాయకత్వం లిఫ్ట్ ఇస్తుందా అన్నది కూడా చర్చగా ఉంది.