వంగవీటికి జాక్ పాట్ రెడీగా ఉందా ?
ఏపీలో అయిదు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. ఇందులో టీడీపీకే నాలుగు ఎమ్మెల్సీలు దక్కుతాయి. ఒకటి జనసేనకు వెళ్ళబోతోంది.
By: Tupaki Desk | 3 March 2025 5:00 AM ISTఏపీలో అయిదు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. ఇందులో టీడీపీకే నాలుగు ఎమ్మెల్సీలు దక్కుతాయి. ఒకటి జనసేనకు వెళ్ళబోతోంది. ఈ నాలుగింటిలో ఒకటి కచ్చితంగా దివంగత నేత కాపుల ఆరాధ్య దైవం వంగవీటి మోహన రంగా వారసుడు రాధాకు ఇస్తారని అంటున్నారు.
ఉమ్మడి క్రిష్ణా జిల్లాకు చెందిన రాధాకు ఎమ్మెల్సీ ఆఫర్ అన్నది ఏనాడో ఇచ్చేశారు అని ఇపుడు ప్రకటించడం అన్నది లాంచనం అని చెబుతున్నారు. అంతే కాదు రాధాకు మంత్రి పదవి యోగం కూడా ఉందని చెబుతున్నారు. ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో ప్రస్తుతం కూటమి నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు.
ఆ ఇద్దరూ టీడీపీకి చెందిన వారే. ఒకరు కొల్లు రవీంద్ర, మరొకరు పార్ధసారధి. పార్థసారథి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి నూజివీడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన సీనియారిటీని గుర్తించి చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు.
అయితే ఆయన పనితీరు పట్ల అసంతృప్తి ఉందని అంటున్నారు. అంతే కాకుండా ఆయనతో లోకల్ గా మొదటి నుంచి ఉండే టీడీపీ క్యాడర్ నాయకులు విభేదిస్తున్నారు అని అంటున్నారు. పార్ధసారధి దూకుడుగా రాజకీయం చేయలేకపోతున్నారు అన్నది కూడా ఉంది. ఆ మధ్యన గౌతు లచ్చన్న ఫంక్షన్ లో మాజీ మంత్రి వైసీపీ నేత అయిన జోగి రమేష్ పార్ధసారధితో కనిపించడం మీద కూడా రచ్చ సాగింది.
ఇవన్నీ దృష్టిలో ఉంచుకుంటే కనుక ఆయనకు మంత్రి పదవి అన్నది కొనసాగింపు డౌటే అని అంటున్నారు. అదే సమయంలో క్రిష్ణా జిల్లాలో విజయవాడలో కీలకంగా ఉన్న రాధాకు మంత్రి పదవి ఇస్తారని అంటున్నారు. ఆయనకు ఆ పదవి ఇవ్వడం ద్వారా కోస్తా జిల్లాలలో ఒక బలమైన సామాజిక వర్గాన్ని పూర్తిగా తమవైపునకు తిప్పుకునే చాన్స్ ఉంటుందని ఆలోచిస్తున్నారని అంటున్నారు.
అదే విధంగా జనసేన వైపు ఎక్కువగా ఉన్న ఆ సామాజిక వర్గాన్ని తమ వైపు కూడా మళ్ళించుకోవడం ద్వారా ఫ్యూచర్ లో మరింతగా రాణించడానికి అవకాశాలు ఉంటాయని టీడీపీ భావిస్తోందని అంటున్నారు. అందువల్ల తమ వద్ద ఉన్న ట్రంప్ కార్డుని రాధా రూపంలో వినియోగించుకోవడానికి ఆయనకు పెద్ద పీట వేస్తారు అని అంటున్నారు.
ఇక 2019 నుంచి రాధా టీడీపీలో ఉంటూ ఆ పార్టీ విజయానికి కష్టపడుతూ వస్తున్నారు. ఆయన 2004లో తొలిసారి కాంగ్రెస్ తరఫున విజయవాడ తూర్పు నుంచి గెలిచారు. ఆ తరువాత మళ్ళీ ఆయన చట్ట సభలలో అడుగు పెట్టలేదు. తిరిగి రెండున్నర దశాబ్దాల తరువాత ఆయనకు అధికార యోగం పట్టబోతోంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికలో ఎన్ని సమీకరణలు మరెన్ని ట్విస్టులు చోటు చేసుకుంటాయో.