జగన్ పై దాడి.. వంగవీటి స్పందన చాలా డిఫరెంట్
మహా వేడి మీద ఉన్న ఏపీ రాజకీయాలను మూడు రోజుల కిందట సీఎం జగన్ పై రాయి దాడి ఘటన అమాంతం మార్చేసింది
By: Tupaki Desk | 16 April 2024 11:23 AM GMTమహా వేడి మీద ఉన్న ఏపీ రాజకీయాలను మూడు రోజుల కిందట సీఎం జగన్ పై రాయి దాడి ఘటన అమాంతం మార్చేసింది. అప్పటినుంచి పరస్పరం విమర్శలు, స్పందనలతో హోరెత్తుతోంది. దాడి అనంతరం ఒక రోజు విరామం తీసుకున్న జగన్.. మరుసటి రోజు తనపై దాడి ద్వారా పేదలను లక్ష్యంగా చేసుకున్నారని.. టీడీపీ కూటమిని నిందించారు. ఇక జగన్ పై దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించగా.. ఆ పార్టీ వారు స్పందిస్తూనే అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. కొందరైతే దీనిని డ్రామాగా అభివర్ణించారు. జన సేన అధినేత పవన్ కల్యాణ్ సైతం జగన్ పై దాడిని ఖండిస్తూనే అనేక ప్రశ్నలు స్పందించారు.
వారి గడ్డపైన..
ఉమ్మడి ఏపీలో కానీ, విభజిత రాష్ట్రంలో కానీ.. దివంగత వంగవీటి మోహన రంగా అంటే ఓ వైబ్రేషన్. మరీ ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాల వారికి ఆయన ఓ సంచలనం. కాపు సామాజిక వర్గం వారికైతే పెద్ద హీరోనే. విజయవాడ తూర్పు నియోజకవర్గానికి కేవలం నాలుగేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న రంగా.. ఆ స్వల్ప కాలంలోనే అనేక ఆందోళనలు, ధర్నాలు, దీక్షలతో సంచలనం రేపారు. దీంతోనే పేదల పక్షపాతిగా ఎదిగారు. అయితే, అనూహ్యంగా హత్యకు గురై అలా చరిత్రలో నిలిచిపోయారు. రంగా వారసుడిగా 2004లో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన కుమారుడు రాధా ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, 2009కి ప్రజారాజ్యం, 2014లో వైసీపీ నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. 2019 ఎన్నికల ముంగిట వైసీపీ టికెట్ దక్కదని తెలిసి ఆశ్చర్యకరంగా టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు. కాగా, ఈ ఎన్నికల్లోనూ రాధాకు టీడీపీ టికెట్ దక్కలేదు. విజయవాడ సెంట్రల్ లో మరోసారి బొండా ఉమాకే టీడీపీ టికెట్ ఇచ్చింది. తూర్పున గద్దె రామ్మోహన్ ను బరిలో దింపింది. పశ్చిమంను బీజేపీకి కేటాయించగా.. ఆ పార్టీ తరఫున సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు.
ఒకనాటి జగన్ సన్నిహితుడు
రంగాకు వైఎస్ అత్యంత సన్నిహితుడు. ఇదే క్రమంలో రాధాను వైఎస్ ప్రోత్సహించారు. ఆయన మరణం అనంతరం రాధా జగన్ వైపు మొగ్గారు. అయితే, టికెట్ విషయంలో విభేదించి రాజీనామా చేశారు. జగన్ నియంత అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాంటి రాధా.. తాజాగా జగన్ పై దాడి మీద స్పందించారు. తమ సొంతగడ్డ విజయవాడలో ఇలాంటి దొంగ దాడి ఎవరూ చేయరని వ్యాఖ్యానించారు. తమవారు ఏదైనా స్ట్రయిట్ గా చేస్తారని.. ఇది ఇక్కడివారి పని కాదన్నట్లు మాట్లాడారు. ఈ మేరకు యూ ట్యూబ్ షార్ట్స్ లో రాధా కామెంట్లు వైరల్ అవుతున్నాయి.