జనసేనతో పెళ్ళి బంధం...వంగవీటి అడుగులు ఎటు...?
నర్సాపురానికి చెందిన జక్కం బాబ్జీ అమ్మానీ దంపతుల రెండవ కుమార్తె పుష్పవల్లిని రాధ వివాహం చేసుకోనున్నారు అని తెలుస్తోంది.
By: Tupaki Desk | 18 Aug 2023 5:37 AM GMTవంగవీటి రాధాక్రిష్ణ ఒకింటి వాడు అవుతున్నారు. దాంతో ఆయన అభిమానులలో ఆనందం వెల్లి విరుస్తోంది. ఆయన 2024 ఎన్నికల్లో పోటీ చేసి చట్ట సభలలో మరోసారి అడుగుపెట్టాలని అనుకుంటున్నారు. అదే సమయంలో దాని కంటే ముందు పెళ్ళి పీటలు ఎక్కుతున్నారు. ఇంతకీ ఆయన చేసుకోబోయే అమ్మాయి వారి రాజకీయ పార్టీ ఏంటి అంటే జనసేన. వంగవీటి కాబోయే మామ జక్కం బాబ్జీ జనసేనలో కీలకంగా ఉన్న నేత.
నర్సాపురానికి చెందిన జక్కం బాబ్జీ అమ్మానీ దంపతుల రెండవ కుమార్తె పుష్పవల్లిని రాధ వివాహం చేసుకోనున్నారు అని తెలుస్తోంది. ఇక అమ్మాని కూడా రాజకీయంగా కీలక పాత్ర పోషించిన వారే. ఆమె 1987లో టీడీపీ నుంచి నర్సాపురం మున్సిపాలిటీ చైర్మన్ గా పనిచేశారు.
ఆ తరువాత ఆ కుటుంబం జనసేన వైపు టర్న్ అయింది. ఇటీవల పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేసినపుడు బాబ్జీ ఇంట్లోనే బస చేశారు. దాంతో బాబ్జీకు జనసేనలో ఎంతటి స్థానం ఉందో ఆయన ఎంతలా కీలకమో అర్ధం అవుతోంది అని అంటున్నారు. ఇక వంగవీటి రాధాకృష్ణ రాజకీయ జీవితం చూస్తే ఆయన 2004లో పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చారు.
ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి తొలిసారి విజయవాడ తూర్పు నుంచి గెలిచారు. 2009లో ఆయన ఓడిపోయారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసినా విజయం దక్కలేదు. 2019 నాటికి వైసీపీని వీడి టీడీపీలోకి వచ్చిన మీదట ఆయనకు అక్కడ టికెట్ దక్కలేదు.
ఇక టీడీపీలో ఉన్న రాధా 2024 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. అయితే ఈ సీటు టీడీపీలో మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాకు కన్ ఫర్మ్ అయిపోయింది. దాంతో రాధాకు ఇవ్వడం కుదరదని అంటున్నారు. దాంతో ఆయన జనసేనలోకి వెళ్ళి అయినా ఈ సీటుని పొందాలని చూస్తున్నారు. పొత్తులు ఉంటే పవన్ పట్టుబడితే చంద్రబాబు ఈ సీటు ఇస్తారని అనుకుంటున్నారు.
ఈ నేపధ్యంలో రాధాకు జనసేన నేత కుమార్తెతోనే వియ్యం కుదురుతోంది. దాంతో ఆయన టీడీపీలో పెద్దగా యాక్టివ్ గా లేరని వార్తలు వస్తున్న క్రమంలో ఆయన వివాహ బంధం కూడా జనసేనతోనే కలిసింది అని అంటున్నారు. రానున్న రోజులలో వంగవీటి రాధా జనసేనలోకి జంప్ చేస్తారా అన్న చర్చకు ఈ పరిణామం బలం చేకూరుతోంది.
ఇదిలా ఉండగా ఈ నెల 19 నుంచి నారా లోకేష్ ఉమ్మడి క్రిష్ణా జిల్లాలలో పాదయాత్ర చేయనున్నారు. దాంతో ఆయన పాదయాత్రలో రాధా పాలు పంచుకోవడం బట్టి ఆయన రాజకీయం ఏంటో అర్ధం అవుతుంది అని అంటున్నారు. ఏది ఏమైనా రాధా రాజకీయ కొత్త బంధాల మీద అంతా ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.