Begin typing your search above and press return to search.

సెంట్రల్ చూసి బోండాకే షాక్ ఇవ్వనున్న వంగవీటి ?

అయితే జనసేనలోకి రాధా వెళ్లడానికి విజయవాడ సెంట్రల్ సీటే కీలకం కాబోతోంది అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   11 Aug 2023 9:05 AM GMT
సెంట్రల్ చూసి బోండాకే షాక్ ఇవ్వనున్న వంగవీటి ?
X

వంగవీటి రాధా. వంగవీటి రంగా కుమారుడు. రాజకీయ వారసుడు. ఇప్పటికి రెండు దశాబ్దాల క్రితం తొలిసారిగా విజయవాడ తూర్పు నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన రాధా 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓడారు, 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి పరాజయం పాలు అయ్యారు. 2019 ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీకి వచ్చినా టికెట్ అయితే దక్కలేదు. ఇక పదిహేనేళ్లుగా రాజకీయంగా అనేక ఒడుదుడుకులు చూస్తూ వస్తున్న రాధా ఈసారి అసెంబ్లీకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు.

దానికి ఆయన గురి పెట్టిన సీటు విజయవాడ సెంట్రల్. ఈ సీటు కోసమే పట్టుబట్టి వైసీపీ హై కమాండ్ తో విభేదించి బయటకు వచ్చిన రాధాకు మళ్లీ టీడీపీ నుంచి కూడా జంప్ కావడానికి ఇదే సీటు కారణం అవుతోంది అని అంటున్నారు. విజయవాడ సెంట్రల్ సీటులో 2014లో బోండా ఉమా మహేశ్వరరావు గెలిచారు. ఆయన 2019 ఎన్నికల్లో జస్ట్ పాతిక ఓట్ల తేడాతో ఓడారు.

ఆయనకు అక్కడ పట్టుంది. పైగా బాబుకు అత్యంత సన్నిహితుడు. టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్. దాంతో ఆ సీటు రాధాకు ఇవ్వడానికి టీడీపీ హై కమాండ్ నో చెబుతోంది. దానికి బదులుగా విజయవాడ తూర్పు సీటుని ఇస్తామని అంటోంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గద్దే రామ్మోహన్ ని గన్నవరం పంపించి రాధాకు అక్కడ టికెట్ ఇవ్వాలనుకుంటోంది. అయితే రాధాకు ఆ సీటు నుంచి పోటీ ఇష్టం లేదు, అలాగే గద్దే రామ్మోహన్ సైతం ఆ సీటుని వదులుకోవడానికి నో చెబుతున్నారని టాక్.

ఈ పరిణామాల నేపధ్యంలో రాధా అడుగులు జనసేన వైపుగా సాగుతున్నాయని అంటున్నారు. జనసేన ఆయన్ని ఆహ్వానిస్తోంది. గతంలో ప్రజారాజ్యంలో కూడా రాధా పనిచేశారు. కాబట్టి మళ్లీ ఆయన్ని తీసుకుని బెజవాడ రాజకీయాలలో ఊపు తీసుకుని రావాలని ఆ పార్టీ చూస్తోంది. అయితే జనసేనలోకి రాధా వెళ్లడానికి విజయవాడ సెంట్రల్ సీటే కీలకం కాబోతోంది అని అంటున్నారు.

ఈ సీటు విషయంలో హామీ ఇస్తే కనుక జనసేనలోకి తాను వచ్చేందుకు రెడీ అని రాధా చెబుతున్నారని ప్రచారం సాగుతోంది. మరి చంద్రబాబుతో ఒప్పించి ఈ సీటుని పొత్తులో భాగంగా పవన్ తీసుకోగలరా అన్నదే ఇక్కడ పాయింట్. బోండా ఉమా తక్కువ ఏమీ కాదు, ఆయన నోరున్న పేరున్న నాయకుడు. తనకు సీటు ఇవ్వకపోతే ఆయన ఏ డెసిషన్ తీసుకుంటారో తెలియదు. దాంతో టీడీపీకి జనసేనకు ఇది ఇబ్బందిగానే ఉంటుంది.

అయితే విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో ఎంతో మక్కువ చూపిస్తున్న రాధా అక్కడే పోటీ అంటున్నారు. అలా ఆయన ఫిక్స్ అయిన ఈ సీటు వైసీపీలో మాత్రం ఖాళీగానే ఉంది అని అంటున్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మల్లాది విష్ణుకు ఈసారి టికెట్ నో అన్నది వైసీపీ ఆలోచనగా ఉంది అని అంటున్నారు. ఇక్కడ నుంచి పోటీకి బలమైన సామాజికవర్గం కోసం వైసీపీ అన్వేషిస్తోంది.

ఇక రాధాకు వైసీపీకి చెందిన మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో కూడా మంచి స్నేహం ఉంది. వారు ఆయన్ని వైసీపీ వైపుగా కూడా నడిపించే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. అయితే జనసేన వైపే రాధా ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు. జనసేన సెంట్రల్ సీటు మీద ఇచ్చే హామీతోనే ఆ పార్టీలోకి రాధా చేరే విషయం ఆధారపడి ఉంది అని అంటున్నారు. ఈ నెలాఖరులోగా ఈ సీటు పంచాయతీ తెగే అవకాశం ఉంది అని అంటున్నారు. మొత్తానికి సెంట్రల్ చూసి రాధ తీసే దెబ్బ బోండా ఉమాకే తగులుతుందా అన్నదే చర్చగా ఉంది మరి.