వంగవీటికి అదిరిపోయే పదవిని రెడీ చేసిన బాబు !
వంగవీటి మోహన రంగా తనయుడు వంగవీటి రాధా రెండు దశాబ్దాలుగా చట్టసభల్లోకి అడుగుపెట్టలేకపోతున్నారు
By: Tupaki Desk | 17 Jun 2024 10:30 AM GMTవంగవీటి మోహన రంగా తనయుడు వంగవీటి రాధా రెండు దశాబ్దాలుగా చట్టసభల్లోకి అడుగుపెట్టలేకపోతున్నారు. ఆయన మొదటిసారి అలాగే చివరి సారి గెలిచింది 2004 ఎన్నికల్లోనే. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన గెలిచారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసినా ఫలితం లేకపోయింది.
ఇక 2019లో ఆయన టీడీపీలో చేరినా టికెట్ దక్కలేదు. అదే పరిస్థితి 2024లోనూ జరిగింది. అయితే వంగవీటి రాధా వైసీపీలో చేరుతారు అని ప్రచారం సాగినా ఆయన టీడీపీలోనే ఉన్నారు. ఆయన కోస్తా జిల్లాలలో ఎన్నికల ప్రచారం విస్తృతంగా చేశారు. కాపులను టీడీపీ కూటమి వైపుగా టర్న్ చేసేందుకు ఆయన తన వైపు నుంచి చేయాల్సింది చేశారు.
వాటి ఫలితాలు కూడా అంతా చూసారు. ఇదిలా ఉంటే వంగవీటి రాధాను ఎన్నికలకు ముందే టీడీపీ అధినేత చంద్రబాబు ఒక హామీ ఇచ్చారని అంటున్నారు. దాని ప్రకారం శాసనమండలిలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఖాయంగా ఇస్తారని సరైన సమయంలో మంత్రిగా కూడా చాన్స్ ఇస్తారని టాక్ అయితే వినిపిస్తోంది.
ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో బీసీలకు రెండు మంత్రి పదవులు బాబు ఇచ్చారు. కాపుల కోటాలో ఇవ్వాలంటే కచ్చితంగా రాధాకు ఆ పదవి ఇస్తారని అంటున్నారు. ఇప్పటికే మంత్రి మండలిలో ఒక పదవి ఖాళీగా ఉంది. మరో వైపు చూస్తే శాసన మండలిలో నాలుగు ఖాళీలు ఉన్నాయి. వీటిలో మొదటి ప్రయారిటీగా ఒక సీటుని వంగవీటికి బాబు ఇస్తారు అని అంటున్నారు.
వంగవీటికి మళ్లీ పూర్వ వైభవం దక్కుతుందని ఆయన అభిమానులు అనుచరులు ధీమాగా ఉన్నారు. ఆయన టీడీపీని వీడిపోకుండా అంకితభావంతో పనిచేయడమే కాదు కాపు కమ్మ కాంబినేషన్ ఏపీలో సూపర్ హిట్ కావడం వెనక తనదైన శైలిలో పనిచేసారని అంటున్నారు. చంద్రబాబు సైతం టీడీపీలో చేరిన రాధాకు ఇప్పటిదాకా ఏ పదవీ ఇవ్వలేకపోయారు.
ఆయన అయిదేళ్ళ పాటు విపక్షంలో ఉండడం అందుకు కారణం. అయితే ఇపుడు అధికారం ఉంది కాబట్టి వంగవీటికి మేలు చేసేలా బాబు అడుగులు ముందుకు వేస్తారు అని అంటున్నారు. ఏది ఏమైనా ఒకసారి మాత్రమే ఎమ్మెల్యే అయి మంత్రి పదవులకు నోచుకుని రాధా రాజకీయ జీవితం రానున్న రోజులలో కీలకమైన మలుపులు తిరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రాధాకు ముందంతా ఉజ్వల భవిష్యత్తు ఉందని కూడా అంటున్నారు. వంగవీటికి కనుక సముచితమైన స్థానం దక్కితే ఉమ్మడి క్రిష్ణా జిల్లాలలో రాజకీయ సామాజిక పరిస్థితులలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.