టీడీపీలోకి వరదాపురం సూరి...పరిటాలకు దారేదీ...!?
అనంతపురం టీడీపీ రాజకీయాలు మరోమారు హీటెక్కనున్నాయి. అనంతపురం అంటే ఒకనాడు పరిటాల రవి అన్నట్లుగా శాసించారు.
By: Tupaki Desk | 6 Jan 2024 3:34 AM GMTఅనంతపురం టీడీపీ రాజకీయాలు మరోమారు హీటెక్కనున్నాయి. అనంతపురం అంటే ఒకనాడు పరిటాల రవి అన్నట్లుగా శాసించారు. ఆయన 1995 నుంచి 2005 వరకూ దశాబ్దం పాటు అనంతపురం రాజకీయాలను తన గుప్పిట పట్టారు. ఆ టైం అంతా టీడీపీ దూకుడు రాజకీయంగానే సాగింది.
పరిటాల రవి హత్య తరువాత ఆయన సతీమణి సునీత రాజకీయ అరంగేట్రం చేశారు. ఇక పరిటాల రవి ఏకైక కుమారుడు శ్రీరామ్ కూడా యువ నేతగా జిల్లా రాజకీయాల్లో స్పీడ్ పెంచారు. ఆయన 2019లోనే టికెట్ కోరుకున్నారు. కానీ టీడీపీ రాప్తాడు టికెట్ ని అప్పటి మంత్రి పరిటాల సునీతకు ఇవ్వడం జరిగింది.
ఇక 2024లో అసెంబ్లీకి పోటీ చేయాలని పరిటాల శ్రీరామ్ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఆయన ధర్మవరం టీడీపీ ఇంచార్జ్ గా ఉన్నారు. ఇదే ధర్మవరం నుంచి 2014లో ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున గెలిచిన వరదాపురం సూరికి 2019లోనూ పార్టీ టికెట్ ఇచ్చింది. అయితే వైసీపీ చేతిలో సూరి ఓటమి పాలు కాగానే పార్టీ జెండా మార్చేసారు.
ఆయన బీజేపీలో చేరిపోయారు. దాంతో ధర్మవరం మొత్తం టీడీపీ బాధ్యతలు పరిటాల శ్రీరామ్ చూసుకున్నారు. రాప్తాడులో తన తల్లి, ధర్మవరంలో తాను పోటీ చేయడం ఖాయమని ఆయన అనుకున్నారు వైసీపీని అడ్డుకుంటూ జిల్లా రాజకీయాల్లో యువనేతగా శ్రీరామ్ దూసుకెళ్తున్నారు. ఈ నేపధ్యంలో సడెన్ గా వరదాపురం సూరి ఎంట్రీ ఇస్తున్నారు.
ఆయన బీజేపీ నుంచి టీడీపీలోకి రానున్నారు అని అంటున్నారు. అంటే తన సొంత పార్టీలోకి అన్న మాట. 2024లో టీడీపీ టికెట్ సంపాదించి వరదాపురం సూరి ధర్మవరం నుంచి పోటీకి రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. పార్టీని కష్టకాలంలో వీడిపోయిన నేతలను తీసుకోను అని చెప్పిన చంద్రబాబు సైతం ఇపుడు సూరిని పార్టీలోకి తీసుకోవడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు అని అంటున్నారు.
దాంతో ధర్మవరం టికెట్ సూరికి ఖాయంగా కనిపిస్తోంది అని అంటున్నారు. సరిగ్గా ఈ పరిణామాలే పరిటాల వర్గంలో అసంతృప్తి జ్వాలలకు కారణం అవుతున్నాయని అంటున్నారు తాను కష్టపడి అయిదేళ్ళ పాటు ధర్మవరంలో అధికార పార్టీకి ఎదురు నిలబడి పోరాడితే చివరికి పార్టీని వదిలేసిన వారికే పెద్ద పీట వేస్తారా అని శ్రీరామ్ తో పాటు ఆయన వర్గం రగులుతోంది అని అంటున్నారు.
అయితే ధర్మవరం సిట్టింగ్ ఎమ్మ్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి బలమైన నాయకుడని ఆయన్ని ఓడించాలి అంటే వరదాపురం సూరి పరిటాల శ్రీరామ్ వర్గాలు కలసి పనిచేయాలని అధినాయకత్వం గట్టిగా కోరుతోంది. ఈ మేరకు ఉన్న సర్వే నివేదికలను కూడా పరిశీలించిన మీదటనే సూరిని తిరిగి సైకిలెక్కిస్తున్నారు అని అంటున్నారు. సూరికి బలమైన వర్గం ధర్మవరంలో ఉంది.
ఇక పరిటాల సునీతకు టికెట్ ఇచ్చి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీగా పరిటాల శ్రీరామ్ ని చేయాలని టీడీపీ అధినాయకత్వం భావిస్తోందిట. ఆయన అటు రాప్తాడు, ఇటు ధర్మవరం లలో టీడీపీని గెలిపించాల్సిన బాధ్యతను తీసుకోవాలని కోరుతున్నారు. అయితే పరిటాల శ్రీరం వర్గం మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉందని టాక్. మరి ఆయన మనసు మార్చుకుని సూరికి సపొర్ట్ చేస్తార లేదా అన్న దాని మీదనే ధర్మవరం రిజల్ట్ ఆధారపడి ఉంటుందని అంటున్నారు.