Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ నేతలకు జగన్ విందు నిజమేనా ?

ఎన్డీయే వైపు చూసేందుకు దారి లేదు. బీజేపీకి రాజ్యసభలో సైతం వైసీపీ అవసరాలు లేవు.

By:  Tupaki Desk   |   9 Sep 2024 10:37 AM GMT
కాంగ్రెస్ నేతలకు జగన్ విందు నిజమేనా ?
X

ఎన్డీయే వైపు చూసేందుకు దారి లేదు. బీజేపీకి రాజ్యసభలో సైతం వైసీపీ అవసరాలు లేవు. ఇక ఏపీలో ఒకటి కాదు రెండు ప్రాంతీయ పార్టీలతో బీజేపీకి పొత్తు ఉంది. చంద్రబాబు పవన్ ఇద్దరూ వైసీపీకి బద్ధ విరోధులే. వారు ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీతోనూ ఏ విధంగానూ బంధం బీజేపీ కలపకూడదనే గట్టిగా కోరుకుంటారు. ఆ దిశగా బలమైన నిఘా పెడతారు. బీజేపీతో ఒత్తిడి తేస్తారు.

ఇది ఢిల్లీ స్థాయిలో పొలిటికల్ సినారియో. ఇక ఏపీలో చూసుకుంటే బీజేపీకి టీడీపీ ఈ రోజున విశ్వాసపాత్రురాలిగా ఉంది. ఒక వేళ ఏమైనా విభేదాలు వస్తే ఆప్షన్ గా జనసేన ఉంది. ఈ రెండు పార్టీలు కలసి ఎదిగేందుకు చూస్తాయి. సరిగ్గా ఇలాంటి అవకాశాన్నే బీజేపీ 2014 నుంచి 2019 మధ్యలో వైసీపీకి ఇచ్చింది. కానీ బీజేపీతో పొత్తుకు వైసీపీ అంగీకరించలేదు అని అంటారు.

పైగా వైసీపీ ఓటు బ్యాంక్ కానీ ఆ పార్టీ వెనక ఉన్న సామాజిక వర్గాలు కానీ బీజేపీతో పొత్తుకు ఏ మాత్రం అనుకూలించేవి కావు. ఇది వైసీపీకి ఇబ్బందికరంగా ఉండే అంశం. అదే టీడీపీకి జనసేనకు కోస్తాలోని పది జిల్లాలకు పైగా ఉన్న చోట్ల బలం గట్టిగా ఉంది. ఇక్కడ మూడు పార్టీల ఓటు బ్యాంక్ దాదాపుగా ఒక్కటే. దాంతో ఈ మూడు పార్టీల పొత్తులకు ఏ రకమైన ఇబ్బంది లేదు.

ఇవన్నీ ఇలా ఉంటే రాజ్యసభలో బీజేపీ తగిన మెజారిటీని సాధించింది. వైసీపీ నుంచి ఇద్దరు ఎంపీలు రాజీనామా చేయడంతో టీడీపీకి కూడా రాజ్యసభలో కొత్తగా ఇద్దరు ఎంపీలు వస్తున్నారు. రానున్న రోజులలో బీజేపీకి అయినా టీడీపీకి అయినా ఎంపీలు పెరగడమే తప్ప తరిగేది ఏదీ లేదు.

దాంతో వైసీపీ అవసరం అయితే ఇపుడు కానీ సమీప భవిష్యత్తు కానీ దీర్ఘకాలంలో కానీ బీజేపీకి లేనే లేదు. దాంతో ఎన్డీయే కూటమిలో వైసీపీకి ఏ మాత్రం రిలేషన్స్ లేనట్లే. ఆ వైపు చూసేందుకు కూడా ఆలోచించాల్సిందే. ఈ క్రమంలో వైసీపీ ఏపీలో నిలదొక్కుకోవాలంటే మరో జాతీయ కూటమి వైపు చూడాల్సిన అవసరం అనివార్యంగా వచ్చి పడింది.

దేశంలో ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా ఇండియా కూటమి బలంగా ఉంది. జగన్ రెండు నెలల క్రితం ఢిల్లీలో ధర్నాను చేపడితే ఇండియా కూటమి నుంచి రాజకీయ పక్షాలే వచ్చాయి. అయితే అపుడు కాంగ్రెస్ నుంచి ఎవరూ రాలేదు. దీని మీద మీడియా జగన్ ని ప్రశ్నిస్తే ఆ విషయం కాంగ్రెస్ నే అడగమని జవాబు చెప్పారు.

ఇవన్నీ పక్కన పెడితే జగన్ బెంగళూరులోనే మకాం వేసి ఉన్నారు. అక్కడ ఆయన వైసీపీ భవిష్యత్తు గురించిన వ్యూహాలను రూపొందించే పనిలో ఉన్నారు అని అంటున్నారు. ఈ క్రమంలో జగన్ ని కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక నేత ఒకరు కలిశారు అని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఇవన్నీ ఒట్టి వార్తలే అని ట్రబుల్ షూటర్ గా పేరు గడించిన ఆ నేత ఖండించారు.

మరో వైపు చూస్తే లేటెస్ట్ గా ఇంకో వార్త అయితే చక్కర్లు కొడుతోంది. జగన్ ఈ శనివారం బెంగళూరులో కాంగ్రెస్ నేతలు కొంతమందికి తన ఇంట్లో విందు ఇచ్చారు అన్నది ఆ వార్త సారాంశం. దానిని బలపరుస్తూ టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ అయిన వర్ల రామయ్య కూడా మాట్లాడుతున్నారు. జగన్ ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆయన టైం అండ్ డేట్ కూడా చెప్పేశారు. శనివారం రాత్రి జగన్ నివాసంలో ఈ విందు జరిగిందని కూడా చెప్పారు. జగన్ ఇండియా కూటమిలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు అని వర్ల రామయ్య ఆరోపించారు. దానిలో భాగంగానే ఈ విందు జరిగింది అని ఆయన అంటున్నారు.

జగన్ కి కనుక ధైర్యం ఉంటే కాంగ్రెస్ నేతలతో ఆయన ఏమి మాట్లాడారో మీడియాకు చెప్పాలని వర్ల రామయ్య నిలదీశారు. జగన్ ఇండియా కూటమికి దగ్గర అయ్యారని అందుకే ఈ విందులు అని ఫుల్ డౌట్లు జనంలో పెట్టేశారు.

మరి ఈ విందు సమావేశాలు నిజమేనా జగన్ కాంగ్రెస్ కి దగ్గర అవుతున్నారా అన్న దాని మీద పుకార్లే తప్ప వాస్తవం తెలియడంలేదు. ఇప్పటికి చాలా సార్లు టీడీపీ నేతలు ఇదే విషయం మీద మాట్లాడుతున్నారు కానీ వైసీపీ నుంచి అయితే ఏ మాత్రం క్లారిటీ రావడం లేదు.

జగన్ బెంగళూరు లో ఎందుకు ఉంటున్నారు అన్నది కూడా ఇపుడు ఒక చర్చగానే ఉంది. ఆయన అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలతో సన్నిహితంగా ఉంటూ ఆ పార్టీ కేంద్ర నాయకత్వానికి దగ్గర అయ్యేందుకే ఇవన్నీ అని టీడీపీ అయితే అనుమానిస్తూ విమర్శిస్తోంది. పాత ప్రచారం పక్కన పెట్టేస్దినా జగన్ బెంగళూరు లో కాంగ్రెస్ నేతలకు ఇచ్చిన విందు అంశం మాత్రం రాజకీయంగా కలకలం రేపుతోంది. మరి అందులో నిజమెంత అన్నది వైసీపీ వారే చెప్పగలరు. మరి వారు నోరు విప్పితేనే వాస్తవాలు బయటకు వచ్చేవి అని అంటున్నారు.