పవన్ తో వర్మ...పిఠాపురానికి జనసేనాని...!
పిఠాపురం వర్మ అన్న పేరు గత నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగులో ఉంది.
By: Tupaki Desk | 18 March 2024 4:13 AM GMTపిఠాపురం వర్మ అన్న పేరు గత నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగులో ఉంది. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తాను అంటే మాజీ ఎమ్మెల్యే వర్మ అభిమానులు అనుచరులు సృష్టించిన గలాభా అంతా ఇంతా కాదు నాన్ లోకల్ పవన్ అని వారే నిందించారు. దానికంటే ముందు ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టి మరీ పిఠాపురంలో లోకల్ నే ఎన్నుకోవాలని పిలుపు ఇచ్చారు.
సీన్ కట్ చేస్తే చంద్రబాబు వద్దకు వెళ్ళిన ఫైర్ బ్రాండ్ వర్మ కూల్ గా మారిపోయారు. బాబు చెబితే వినాలి అంటూ రాముడు మంచి బాలుడు అన్న తరహాలో మీడియా ముందు కనిపించారు. పవన్ కి జై అన్నారు. ఆ తరువాత సన్నివేశం మరింత ఆసక్తికరం. వర్మ నేరుగా పవన్ దగ్గరకు వెళ్ళి ఆయనను కలిశారు.
పవన్ కూడా వర్మ భుజం మీద చేయి వేసి ఆప్యాయత చూపించారు. పవన్ కి అలా ఫుల్ సపోర్ట్ ఇచ్చిన వర్మ పిఠాపురంలో పవన్ విజయానికి తాను అన్ని విధాలుగా సహకరిస్తాను అని చెప్పి వచ్చారు. అంతే కాదు టీడీపీ కార్యకర్తలు నేతలతో మాట్లాడి పవన్ గెలుపు బాధ్యతలు పూర్తిగా చూస్తాను అని భరోసా ఇచ్చారు.
ఇక పవన్ కళ్యాణ్ కూడా వర్మ విషయంలో ఫుల్ హ్యాపీగా కనిపించారు మరో నాలుగు రోజులలో తాను పిఠాపురం వస్తానని అక్కడ సమావేశాలు ఇతర ఏర్పాట్లు చూడమని కోరారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే వర్మ ఇపుడు పవన్ గెలుపు బాధ్యతలు భుజాల మీద వేసుకున్నారు అన్న మాట.
వర్మ 2014లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి 47 వేల పై చిలులు మెజారిటీతో గెలిచిన మొనగాడుగా ఉన్నారు. ఆయన 2019లో ఓటమి పాలు అయ్యారు. 2024 ఎన్నికలకు ప్రిపేర్ చేసుకుంటున్న నేపధ్యంలో పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి పోటీ అంటే వర్మతో సహా అంతా మొదట ఆగ్రహించారు.
ఇపుడు చంద్రబాబు నుంచి ఎమ్మెల్సీ హామీ ఆయనకు ఉంది. అలాగే వీలైతే మంత్రి పదవి కూడా ఇస్తారని ప్రచారమూ ఉంది. ఇవన్నీ వర్మకు బంపర్ ఆఫర్లుగానే చూడాలి. 2024 ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా ఈ టైం లో పోటీ చేసి గెలవడం అంటే మాటలు కాదు, దాత్నో వర్మ తనకు సరైన హామీ కావాలనే కొంత ఆగ్రహం చూపించారు అని అంటున్నారు.
అంతా వ్యూహాత్మకంగానే సాగింది. ఇక చంద్రబాబుకు సైతం పవన్ ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. పవన్ జనసేన టీడీపీకి పూర్తి మద్దతుగా నిలవాలంటే పవన్ గెలుపు బాబుదే అని అంటున్నారు. అందుకే వర్మకు పిలిచి మరీ హామీలతో ఆయన దారికి తెచ్చారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే టీడీపీ జనసేనలో పిఠాపురం ఎపిసోడ్ లో ఆల్ హ్యాపీస్ అని అంటున్నారు. ఇపుడు పవన్ ని ఓడించాలని వైసీపీ చేస్తున్న ప్లాన్స్ ఏమిటి ఆ పార్టీకి లభించే అండదండలు ఏమిటి అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు.