Begin typing your search above and press return to search.

పిఠాపురం సీటుపై వర్మ హాట్ కామెంట్స్

అయితే, ఈ వ్యవహారం సద్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో తాజాగా పిఠాపురం సీటుపై వర్మ మరోసారి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

By:  Tupaki Desk   |   20 March 2024 11:47 AM GMT
పిఠాపురం సీటుపై వర్మ హాట్ కామెంట్స్
X

టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గం వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు తెరలేపిన సంగతి తెలిసిందే. పిఠాపురం నుంచి తాను పోటీ చేస్తున్నాను అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించడంతో ఆ సీటు ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వర్మ కాస్త అసంతృప్తికి లోనయ్యారు. అయితే, ఆ తర్వాత వర్మను చంద్రబాబు బుజ్జగించడంతో ఆయన మెత్తబడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి ఎమ్మెల్సీ వర్మకే కేటాయిస్తానని, తమ ప్రభుత్వంలో ఆయనకు ఉన్నత స్థానం కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇవ్వడంతో వర్మ అలక వీడారు.

అయితే, ఈ వ్యవహారం సద్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో తాజాగా పిఠాపురం సీటుపై వర్మ మరోసారి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేస్తే పిఠాపురం అసెంబ్లీ నుంచి తాను పోటీ చేస్తానని వర్మ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని స్వయంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వర్మ కామెంట్లు ఆసక్తికరంగా మారాయి. అయితే, చంద్రబాబుకు తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని వర్మ అన్నారు.

పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఆయన విజయానికి పాటుపడతానని వర్మ మరోసారి స్పష్టం చేశారు. పొత్తులో భాగంగా కూటమి గెలుపు కోసం శ్రమించాలని పిఠాపురం టీడీపీ శ్రేణులకు వర్మ పిలుపునిచ్చారు. జనసేనకు పొత్తులో భాగంగా రెండు ఎంపీ సీట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి కాకినాడ. దీంతో, కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా ఉదయ్ శ్రీనివాస్ కు టికెట్ ఖరారు అయింది. అయితే మిగిలిన ఒక్క ఎంపీ స్థానం నుంచి పోటీ చేయబోయే అభ్యర్థి ఎవరు అన్నది ఇంకా తేలలేదు.

దీంతో, పవన్ కళ్యాణ్ మరో ఎంపీ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని, పిఠాపురం అసెంబ్లీ తో పాటు మరో లోక్ సభ స్థానం నుంచి కూడా పవన్ పోటీ చేస్తారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని పవన్ ఖండించకపోగా బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేసే అవకాశాలున్నాయని పరోక్షంగా హింట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే వర్మ ముందు జాగ్రత్త చర్యగా ఒకవేళ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయకపోతే తాను సిద్ధంగా ఉన్నానని టిడిపి అధిష్టానానికి సంకేతాలు పంపించారు.