పోలీసుల అదుపులో వర్రా రవీందర్ రెడ్డి
బరితెగింపు అన్న మాట సైతం చిన్నబోయేలా వ్యవహరించే కొందరి తీరు చూస్తే.. మరీ ఇంత విచ్చలవిడితనమా? అన్న ఆశ్చర్యం వ్యక్తమవుతోంది
By: Tupaki Desk | 6 Nov 2024 4:11 AM GMTబరితెగింపు అన్న మాట సైతం చిన్నబోయేలా వ్యవహరించే కొందరి తీరు చూస్తే.. మరీ ఇంత విచ్చలవిడితనమా? అన్న ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఎంత సోషల్ మీడియా అయితే మాత్రం.. నోటికి వచ్చినట్లుగా ఇష్టారాజ్యంగా ఎవరినైనా.. ఎంత మాట అయినా అనేయొచ్చా? అన్న సందేహం కలుగుతుంది. తాము అభిమానించే వారిని పొగిడేయటం.. తమ అభిమాన నాయకుడికి రాజకీయ నష్టం కలిగిస్తుంటే చాలు.. వెనుకా ముందు చూసుకోకుండా బరితెగింపు ధోరణిని ప్రదర్శించే కొందరి అతిగాళ్లపై ఏపీ పోలీసులు ఇప్పుడు ఫోకస్ చేశారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది.
తాజాగా వర్రా రవీందర్ రెడ్డిని పులివెందలలో పోలీసులు అదుపులోకి తీసుకొన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అతడ్ని కడపకు తీసుకొచ్చి రహస్యంగా విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ రాజకీయ ప్రత్యర్థులపై వర్రా పెట్టిన పోస్టులను చూసినోళ్లు ముక్కున వేలేసుకునేటోళ్లు. సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా.. తిట్లు సైతం ఉలిక్కిపడేలా ఆయన పోస్టులు ఉండేవి.
కడప ఎంపీ అవినాష్ రెడ్డికి అత్యంత కావాల్సిన అనుచరుడిగా ఉండేవారు. జగన్ ప్రభుత్వం మారి.. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కూడా వర్రా రవీందర్ రెడ్డి మాత్రం తన దూకుడు తగ్గించలేదు. సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి చంద్రబాబు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లతో పాటు మంత్రులు లోకేశ్.. హోం మంత్రి అనితపై పలు అభ్యంతరకర వ్యాఖ్యలతో పోస్టులు పెట్టిన పరిస్థితి. ఆ మాటకు వస్తే.. షర్మిల.. విజయమ్మను సైతం వదల్లేదు. ఇక.. వైఎస్ వివేకా కుమార్తె సునీతను అయితే.. ఏకంగా.. ‘సునీతను కూడా లేపేయండి’ అంటూ పెట్టిన పోస్టు షాకిచ్చేలా మారింది.
ఇతగాడి పోస్టులకు తీవ్ర మనస్తాపానికి గురైన షర్మిల.. హైదరాబాద్ లో పోలీసులకు కంప్లైంట్చేవారు. ఇతగాడే షర్మిల పుట్టుక మీదా రోత పుట్టేలా పోస్టులు పెట్టిన ఘన చరిత్ర. ఏపీలో ప్రభుత్వం మారినా.. తన తీరు మార్చుకోని అతడ్ని తాజాగా అదుపులోకి తీసుకున్న పోలీసులు కడపకు తీసుకొచ్చి రహస్యంగా విచారిస్తున్నట్లుగా సమాచారం. అతగాడి అరెస్టు త్వరలోనే ప్రకటిస్తారని చెబుతున్నారు.