'నేను తుపాకీ... కాల్చింది అవినాష్ రెడ్డి'!
ఆ స్థాయిలో ఉంది ఇప్పుడు వ్యవహారం. ఈ విషయంలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది
By: Tupaki Desk | 12 Nov 2024 3:57 AM GMTఏపీలో ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా.. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వారిపై తీసుకుంటున్న చర్చల గురించే చర్చ అని చెప్పినా అతిశయోక్తి కాదేమో. ఆ స్థాయిలో ఉంది ఇప్పుడు వ్యవహారం. ఈ విషయంలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.
అవును... సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. అవినాష్ రెడ్డి పాత్ర కీలకంగా మారిందని అంటున్నారు! ఈ సందర్భంగా వర్రా రవీందర్ రెడ్డి వాంగ్మూలంపై కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కీలక విషయాలు వెల్లడించారు.
ఇందులో భాగంగా... ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ బండి రాఘవరెడ్డి ద్వారా సమాచారం అందుకొని, తాను ఆ పోస్టులు పెట్టినట్లు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి చెప్పినట్లు డీఐజీ ప్రవీణ్ వెల్లడించారు. ఈ సూచనల మేరకే విజయమ్మ, షర్మిల, వివేకా కుమార్తె సునీతపై అసభ్యకరమైన పోస్టులు పెట్టినట్లు చెప్పారని తెలిపారు.
ఈ కేసులో వర్రా రవీందర్ రెడ్డితో పాటు అతడు పారిపోవడానికి సహకరించిన సుబ్బరెడ్డి, ఉదయ్ లను పోలీసులు సోమవారం కడపలో మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. చంద్రబాబు, పవన్, హోంమంత్రి అనిత సహా పలువురు ప్రముఖుల కుటుంబ సభ్యులే లక్ష్యంగా అసభ్య పోస్టులు పెడుతున్నారని.. ప్రవీణ్ వెల్లడించారు.
ఇదే సమయంలో... ఇలాంటి వారిని సుమారు 400 మందిని నియమించుకుని, వారి కార్యకలాపాల కోసం 40 సోషల్ మీడియా టీమ్ ని ఏర్పాటు చేసుకున్నారని.. కంటెంట్ ప్రసారాల కోసం సుమారు 40 యూట్యూ ఛానల్స్ కూడా నడిపారని అంటున్నారు. ఈ క్రమంలో... వీరంతా తాడేపల్లిలోని పీవీఆర్ ఐకాన్ బిల్డింగ్ మూడో అంతస్తులో కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారని అంటున్నారు.
14 రోజుల రిమాండ్!:
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచగా.. విచారణ అనంతర అతడికి జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. విచారణ సందర్భంగా పోలీసులు తనను తీవ్రంగా కోట్టారని వర్ర రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. దీంతో... అతడికి కడప రిమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు.