వైసీపీ వర్సెస్ టీడీపీ: మండలిలో మాటల మంటలు
ఇక, వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి వర్సెస్ హోం మంత్రి అనితల మధ్య మాటల తూటాలు జోరుగానే పేలాయి.
By: Tupaki Desk | 15 Nov 2024 8:30 AM GMTవైసీపీ వర్సెస్ టీడీపీ.. ఇప్పుడు శాసన మండలిలో మంటలు పట్టిస్తోంది. శాసన సభకు రాని వైసీపీ నేత లు.. మండలికి మాత్రం ఎక్కువగానే వస్తున్నారు. సర్కారుపై ప్రశ్నలు కూడా సంధిస్తున్నారు. ఈ క్రమం లో శుక్రవారం శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్యేలకు, టీడీపీ మంత్రులకు మధ్య మాటల యుద్ధం జోరు గా సాగింది. కూటమి సర్కారు తీసుకువచ్చిన నూతన మద్యం విధానంపై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రశ్నించారు. దీనివల్ల ధరలు పెరిగిపోయాయని, ఫలితంగా అధికార పార్టీ నాయకుల జేబులు నిండుతు న్నాయని చెప్పారు.
దీనికి ప్రతిగా ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర సమాధానం చెప్పారు. దేశంలోనే అత్యుత్తమ మద్యం పాలసీ ని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోదన్నారు. దీనికి ఇతర రాష్ట్రాల నుంచి ప్రశంసలు కూడా వచ్చాయని తెలి పారు. మద్యం అందుబాటులో ఉండడంతోపాటు నాణ్యమైన మద్యమే ఇప్పుడు ప్రజలకు చేరువైందన్నా రు. దీనివల్ల మరణాలు తగ్గుముఖం పట్టాయనిచెప్పారు. త్వరలోనే మద్యం ధరలను తగ్గించేందుకు ప్రయత్నించనున్నట్టు తెలిపారు. వైసీపీ అనవసరంగా నోరు పారేసుకుందన్నారు.
ఇక, వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి వర్సెస్ హోం మంత్రి అనితల మధ్య మాటల తూటాలు జోరుగానే పేలాయి. గురువారం జరిగిన మాటల యుద్ధానికి కొనసాగింపు అన్నట్టుగానే తాజాగా కూడా ఇద్దరు నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. మరోవైపు.. నిత్యవసరాలు, వంటనూనెల ధరలు పెరుగుదలపై చర్చించాలని శాసనమండలిలో వైసిపి ఎమ్మెల్సీలు వాయిదా తీర్మానం ఇచ్చారు.
వైసీపీ ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, మంగమ్మ, కల్పలతలు ఇచ్చిన ఈ తీర్మానాన్ని చైర్మన్ తిరస్క రించారు. దీంతో సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ బయటకు వచ్చారు. ఇదే సమయంలో అధికార పార్టీ(మూడు పార్టీలు) ఎమ్మెల్సీలు కూడా వైసీపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ.. నినాదాలతో హోరెత్తించారు. అయితే.. అసెంబ్లీలో మాత్రం చడీ చప్పుడు లేకుండా కార్యక్రమాలు కొనసాగుతుండగా.. మండలిలో మాత్రం ఇరు పక్షాల మధ్య వాగ్యుద్ధం జోరుగాసాగుతుండడం గమనార్హం.