Begin typing your search above and press return to search.

బీజేపీతో చెల్లుకు చెల్లు ఆడుతున్న ఆ పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ!

వాస్తవానికి రాయ్ బరేలీ అనేది సోనియా గాంధీకి కంచుకోట అనే సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   26 April 2024 6:58 AM GMT
బీజేపీతో చెల్లుకు చెల్లు ఆడుతున్న ఆ పార్టీ ఎంపీ వరుణ్  గాంధీ!
X

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమలో... మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ భావిస్తుంటే.. మరోసారి బీజేపీ ఆ అవకాశం ఇవ్వకూడదని కాంగ్రెస్ కసరత్తులు చేస్తుంది! ఈ సమయంలో బీజేపీకి ఊహించని పరిణామం ఎదురైంది. గత లోక్ సభ ఎన్నికల్లో యూపీలోని పిలిభిత్ సీటు నుంచి బీజేపీ ఎంపీగా గెలిచిన వరుణ్ గాంధీకి ఈసారి మాత్రం అక్కడ టిక్కెట్ నిరాకరించింది! ఈ నేపథ్యంలో.. రివర్స్ లో వరుణ్ కూడా బీజేపీ షాకిచ్చాడని తెలుస్తుంది!

అవును... గత కొంతకాలంగా బీజేపీ విధానాలపై బహిరంగానే విమర్శలు చేస్తున్న వరుణ్ గాంధీకి ఈసారి టికెట్ ఇచ్చేందుకు కాషాయ పార్టీ ఆసక్తి చూపలేదు! అయితే వరుణ్ కూడా దీనిపై పెద్దగా ప్రతిస్పందించలేదు. పార్టీ పెద్దలపై ఎటువంటి విమర్శలూ చేయలేదు. ఈ నేపథ్యంలో తాజాగా వరుణ్ ను కాంగ్రెస్ కంచుకోట అయిన రాయ్ బరేలీ సీటు నుంచి బరిలోకి దించాలని బీజేపీ భావించింది. ఇక్కడే అసలు రాజకీయం మొదలైంది!

వాస్తవానికి రాయ్ బరేలీ అనేది సోనియా గాంధీకి కంచుకోట అనే సంగతి తెలిసిందే. 2004 నుంచి ఆమె వరుసగా గెలుస్తూ వస్తున్నారు. అయితే ఈ సారి మాత్రం ఇక ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటూ.. రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకమైన రాయ్ బరేలీలో ఎవరు పోటీ చేస్తున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ తరుణంలో ప్రియాంక గాంధీని రాయ్ బరేలీ నుంచి పోటీ చేయించాలని ఆ పార్టీ భావిస్తోందనే విషయం తెరపైకి వచ్చింది.

దీంతో రాయ్ బరేలీలో ప్రియాంక గాంధీపై పోటీగా వరుణ్ గాంధీని బరిలోకి దించాలనే ఆలోచన బీజేపీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో బీజేపీ పాచికను వరుణ్ గాంధీ పారనివ్వలేదు. ఇందులో భాగంగా... సోదరి ప్రియాంకపై పోటీ చేసేందుకు వరుణ్ గాంధీ అంగీకరించలేదని సమాచారం! అటుతిప్పి ఇటు తిప్పకుండా... బీజేపీ ఆఫర్ ను వరుణ్ గాంధీ తిరస్కరించారని అంటున్నారు. దీంతో... ఇది బీజేపీకి షాకింగ్ విషయమే అని అంటున్నారు పరిశీలకులు.

కాగా... ఇందిరాగాంధీ చిన్న కుమారుడు సంజయ్ గాంధీ కుమారుడైన వరుణ్ గాంధీ, ఆయన తల్లి మేనకా గాంధీ బీజేపీ ఎంపీలుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే బీజేపీ మార్కు పాలిటిక్స్ లో మాత్రం వారు ఎప్పుడూ అంత యాక్టివ్ గా కనిపించలేదు. రాజీవ్ గాంధీ సతీమణి సోనియా గాంధీతో విభేదాల కారణంగా మాత్రమే వారు కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్నరాని అంటున్నారు. ఈ నేపథ్యంలో... ఈ విభేదాలను సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించిన బీజేపీకి వరుణ్ తాజా నిర్ణయం షాకిచ్చిందని అంటున్నారు!