జగన్ ప్రభుత్వంపై వసంత సంచలన వ్యాఖ్యలు!
ఈ నేపథ్యంలో వసంత కృష్ణప్రసాద్ మైలవరంలో తాజాగా అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 5 Feb 2024 10:06 AM GMTజగన్ ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. గత ఎన్నికల్లో మైలవరం నుంచి వైసీపీ తరఫున వసంత కృష్ణప్రసాద్ ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా అభివృద్ధిపై ప్రశ్నిస్తున్న ఆయనకు వైఎస్ జగన్ సీటు నిరాకరించారు. మైలవరం సీటును వచ్చే ఎన్నికల కోసం జడ్పీటీసీ సభ్యుడిగా ఉన్న తిరుపతిరావుకు కేటాయించారు.
ఈ నేపథ్యంలో వసంత కృష్ణప్రసాద్ మైలవరంలో తాజాగా అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల ముందు రాజధానిపై జగన్ ను స్పష్టత అడిగానన్నారు. తాను తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నా కదా.. రాజధాని ఇక్కడే ఉంటుందని జగన్ సమాధానం ఇచ్చారని తెలిపారు, అయితే ఎన్నికల తర్వాత జగన్ మాటమార్చారని మండిపడ్డారు.
మూడు రాజధానుల బిల్లు పెట్టిన రోజే జగన్ పార్టీ సమావేశం నిర్వహించారన్నారు. ఆ సమావేశంలో బిల్లును సమర్థించాలని ఎమ్మెల్యేలను ఆదేశించారని వెల్లడించారు. దీనివల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని అప్పడే తాను ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించానని తెలిపారు.
మూడు రాజధానులను ఏర్పాటు చేయడం తప్పనిసరైతే కనీసం సచివాలయాన్ని అయినా ఇక్కడే ఉంచాలని కోరానని వసంత కృష్ణప్రసాద్ తెలిపారు.
అలాగే నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం ఎన్నోసార్లు అడిగానన్నారు. ఎన్ని ప్రతిపాదనలు ఇచ్చినా వాటన్నింటిని బుట్టదాఖలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మైలవరం నియోజకవర్గంలో అభివృద్ధి ఏమీ చేయలేకపోవడంతో తనలో అంతర్మథనం మొదలైందన్నారు. గత ఏడాది కాలంగా పార్టీలో అవమానాలు ఎదురవుతున్నా సహించానన్నారు.
ఎమ్మెల్యేగా ఉండి సీఎం నుంచి ఒక్క రూపాయి కూడా సాధించలేకపోయానని వసంత కృష్ణప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తాను అడిగితే నందిగామ కోసం వైఎస్‌ఆర్ రూ.100 కోట్ల నిధులిచ్చారని గుర్తు చేశారు. అయితే జగన్ హయాంలో మాత్రం రూ.కోటి కూడా తెచ్చుకోలేకపోయానన్నారు. పనులు చేసిన వైసీపీ కార్యకర్తలకు బిల్లులు రాలేదన్నారు. ప్రభుత్వానికి కార్యకర్తలు పెట్టుబడి పెట్టాలా అని హాట్ కామెంట్స్ చేశారు.
కక్ష సాధింపు చర్యలతో ఏమీ సాధించలేరని తెలిపారు. అధికారం ఉందని అహంకారం ప్రదర్శించకూడదని వసంత కృష్ణప్రసాద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును తిడితే పదవులు ఇస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. మనసు గాయపడ్డాక నిలువెత్తు బంగారం ఇస్తానన్నా వెనక్కి వెళ్లబోనన్నారు. తన రాజకీయ భవిష్యత్ పై తన అనుచరులు, కార్యకర్తలతో మాట్లాడి త్వరలో నిర్ణయం తీసుకుంటానన్నారు. ఎవరెన్ని ఆరోపణలు చేసినా భయపడబోనన్నారు.
వచ్చే ఎన్నికల్లో తాను మైలవరం నుంచే పోటీ చేస్తానన్నారు. టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీల నుంచి కూడా తనకు ఆహ్వానాలు అందాయన్నారు. ఏ పార్టీ నుంచి పోటీ చేసేది త్వరలోనే వెల్లడిస్తానన్నారు.
మంత్రి జోగి రమేశ్ వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డానన్నారు. అతడు వెన్నుపోట్లు పొడుస్తుంటే అదే పార్టీ నుంచి తాను ఎలా పోటీ చేస్తానని ప్రశ్నించారు.