Begin typing your search above and press return to search.

గోరంట్ల మాధవ్ పై వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు.. వారంలో కీలక అప్ డేట్!

ఈ సందర్భంగా వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   2 Nov 2024 11:28 AM GMT
గోరంట్ల మాధవ్  పై వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు.. వారంలో కీలక అప్  డేట్!
X

ఇటీవల వైసీపీ అధినేత తీరుని తప్పుబడుతూ ఏపీ మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా... నాయకులు, కార్యకర్తల కోసం ఉండాల్సింది "గుడ్ బుక్" కాదని, "గుండె బుక్" అని.. పార్టీకోసం ప్రాణాలు పెట్టిన కార్యకర్తలు అవసరం లేదనుకునే జగన్ మరోసారి మోసం చేయడానికి సిద్ధపడుతున్నారని ఫైర్ అయ్యారు!

ఈ నేపథ్యంలో.. ఆమె వైఎస్ షర్మిలకు చాలా సన్నిహితురాలని.. ఆమె నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందనే ప్రచారమూ జరిగింది. ఈ క్రమంలో తాజాగా మరోసారి మైకుల ముందుకు వచ్చారు వాసిరెడ్డి పద్మ. ఈ సందర్భంగా వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... వైసీపీ మాజీ ఎంపీ, గోరంట్ల మాధవ్ పై ఏపీ మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన పనులు నిస్సిగ్గుతో కూడుకున్నవని అన్నారు! అత్యాచార బాధితుల పేర్లను మాధవ్ వెల్లడిస్తున్నారని.. ఒక వర్గం మీడియా కూడా ఈ పనికి పూనుకుందని ఫైర్ అయ్యారు.

ఈ సందర్భంగా.. విజయవాడ సీపీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అత్యాచార బాధితుల పేర్లను వెల్లడించడం దుర్మార్గమని, ఈ సమయంలో మాజీ ఎంపీ మాధవ్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. జరిగిన పొరపాటును గ్రహించకుండా ఈ వ్యవహారాన్ని కొన్ని మీడియా ఛానల్స్ యూట్యూబ్ లో అప్ లోడ్ చేశాయని మండిపడ్డారు!

ఇక.. వైసీపీకి రాజీనామా చేసినప్పటి నుంచీ వాసిరెడ్డి పద్మ ఏ పార్టీలో చేరబోతున్నరనే చర్చ నడుస్తోంది! ఈ సమయంలో.. తాను ఏపార్టీలో చేరబోతోంది మరో వారం రోజుల్లో ప్రకటిస్తానని ఆమె తెలిపారు. ఇదే సమయంలో.. విజయవాడ ఎంపీ కేశినేని నాని తనకు ఆప్తులని ఆమె ఈ సందర్భంగా వెల్లడించారు.

కాగా... గతంలో ప్రజారాజ్యం పార్టీలో, అనంతరం వైసీపీలో పనిచేసిన పద్మ... ఈసారి టీడీపీలో చేరే అవకాశాలున్నాయని కొందరు అంటుంటే.. ప్రజారాజ్యం సమయంలో పవన్ తో ఏర్పడిన పరిచయం మేరకు జనసేన వైపు చూసే అవకాశాలనూ కొట్టిపారేయలేమని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు! ఏది ఏమైనా... మరో వారం రోజుల్లో ఈ వ్యవహారంపై క్లారిటీ రానుంది!!