భవిష్యత్ కార్యచరణ ప్రకటించిన వాసిరెడ్డి పద్మ... ముహూర్తం ఫిక్స్!
ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఇందులో భాగంగా.. వచ్చేవారంలో టీడీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు.
By: Tupaki Desk | 7 Dec 2024 3:07 PM GMTఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ నుంచి ఇతర పార్టీలో చేరుతున్నవారి జాబితాలో మరో పేరు చేరబోతోంది. ఇందులో భాగంగా... వైసీపీకి ఇటీవల రాజీనామా చేసిన ఏపీ మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మరో పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆమె తన నిర్ణయాన్ని వెల్లడించారు.
అవును... 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీకి దూరంగా ఉంటూ వచ్చినట్లు కనిపించిన వాసిరెడ్డి పద్మ.. ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు! ఆ సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితోనూ కలిశారు! దీంతో... ఆమె తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారనే చర్చ నాడు బలంగా వినిపించింది.
ఆ సమయంలో వైసీపీ విధానాలపైనా, జగన్ తీరుపైనా ఘాటు విమర్శలు చేశారు. అధికారంలో ఉన్నంత కాలం పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల అవసరం లేదన్నట్లుగా వ్యవహరించిన జగన్.. ఇప్పుడు గుడ్ బుక్ అంటూ మాట్లాడుతున్నారని.. కార్యకర్తల విషయంలో జగన్ కు బాధ్యత లేదన్నట్లుగా వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు.
ఇదే సమయంలో... వైసీపీకి రాజీనామా చేస్తున్నానని, త్వరలోనే భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని ఆమె అప్పట్లో చెప్పారు. ఈ నేపథ్యంలో... నాడు టీడీపీలో చేరబోతున్నారంటూ వచ్చిన వార్తలను నిజం చేస్తూ ఆమె పసుపు కండువా కప్పుకోబోతున్నట్లు ప్రకటించారు! ఈ సందర్భంగా కేశినేని చిన్నితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఇందులో భాగంగా.. వచ్చేవారంలో టీడీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు.
కాగా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన వాసిరెడ్డి పద్మ... ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అనంతరం వైసీపీలో చేరారు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత ఆమెను.. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు.